గంజాయికి హుక్కా తోడు..మహారాష్ట్ర సరిహద్దుల నుంచి సప్లయ్

గంజాయికి హుక్కా తోడు..మహారాష్ట్ర సరిహద్దుల నుంచి సప్లయ్
  • మత్తు వలయంలో చిక్కుకుంటున్న స్టూడెంట్స్, యూత్ 

నిర్మల్, వెలుగు : గంజాయికి బానిసలై ఇప్పటికే ఆగమైపోతున్న స్టూడెంట్స్, యూత్ మరో మత్తు వలయంలో చిక్కుకుంటున్నారు. జోరుగా గంజాయి, హుక్కా తాగుతూ మత్తులో చిత్తవుతున్నారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ శివారు ప్రాంతాలు, స్లమ్ ఏరియాల్లో యువకులు గంజాయి మత్తులో జోగుతున్నారు. కొత్తగా హుక్కా అలవాటు చేసుకుంటున్నారు.

కొన్ని నెలల కిందముథోల్​లోని ఓ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్​కు చెందిన ముగ్గురు టెన్త్ ​క్లాస్ స్టూడెంట్లు హుక్కా తాగుతూ పట్టుబడిన వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. స్కూల్​స్టూడెంట్లు కూడా హుక్కా కు అలవాటు పడిన తీరు ఇక్కడి మత్తు తీవ్రతకు అద్దం పడుతోంది.

గుట్టుచప్పుడు కాకుండా..

జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర ప్రాంతంలో హుక్కాలో వినియోగించే టొబాకో మిశ్రమాన్ని తయారు చేస్తున్నట్లు సమాచారం. నాందేడ్, పర్బనీ, జాల్నా, ఔరంగాబాద్ ప్రాంతాల నుంచి ఈ మిశ్రమాన్ని కొందరు జిల్లా సరిహద్దుల్లోకి  చేరవేస్తూ స్టూడెంట్లు, యూత్​కు దీన్ని అలవాటు చేస్తున్నారు. కొంతమంది మీడియేటర్లు ఈ దందాను పకడ్బందీగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. యువకులకు అలవాటు చేసేందుకు కొంతమంది ముఠాగా ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ముథోల్, భైంసా ప్రాంతాల్లో హుక్కా అలవాటు విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది.

కొద్ది నెలల కింద ముథోల్ ప్రాంతంలో కొంతమంది స్టూడెంట్లు హుక్కాను వినియోగిస్తున్నట్లు వెలుగులోకి రావడంతో పోలీసు అధికారులు ఈ విషయాన్ని సీరియస్​గా పరిగణించి అన్ని విద్యా సంస్థల్లో కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికీ పోలీసులు హుక్కాపై నిఘా సారిస్తున్నప్ప టికీ గుట్టుగా అమ్మకాలు, వినియోగం కొనసాగుతోంది

గంజాయి కలకలం

నిర్మల్ పట్టణంలోని పలు శివారు వార్డుల్లో గంజాయిని రహస్యంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే 10 సార్లు గంజాయిని విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఈ దందాను పూర్తిగా నివారించలేకపోతున్నారు. గంజాయికి బానిసలైన యువకులు కొన్ని ఎంపిక చేసుకున్న శివారు ప్రాంతాల్లో తాగుతూ మత్తులో జోగుతున్నారు. పోలీసులు పలుసార్లు కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ పూర్తిస్థాయిలో అమ్మకాలు, వినియోగాన్ని అడ్డుకోలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

గంజాయి, హుక్కాతో ప్రాణానికే ప్రమాదం

హుక్కా, గంజాయి అలవాటుతో ప్రాణాలకే ప్రమాదం. అత్యధికంగా నికోటిన్ ఉండే ఈ పదార్థాలు క్యాన్సర్​కు దారి తీస్తాయి. గంజాయి, హుక్కా పొగ ఊపిరితిత్తులపై ప్రభావం మాత్రమే కాకుండా శరీరమంతా వ్యాపిస్తుంది. దీంతో గుండె వ్యాధితో పాటు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. వీటికి అలవాటు పడ్డవారు నిత్యం  మత్తులోనే ఉండేందుకు బానిసలుగా మారిపోతారు.

 – డాక్టర్ కృష్ణంరాజు, నిర్మల్

డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలి

జిల్లాలో గంజాయి సాగు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రెండురోజుల కింద స్థానిక కలెక్టరేట్​లో ఎస్పీ ప్రవీణ్ కుమార్​తో కలిసి నార్కోటిక్ కంట్రోల్ కో ఆర్డినేషన్ కమిటీ యాక్షన్ ప్లాన్ పై సమీక్ష నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు, మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అధికారులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేసి వారానికోసారి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

ఎస్పీ మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాల్లో గంజాయి మొక్కలు పెంచకుండా వ్యవసాయ అధికారులు పర్యవేక్షించాలన్నారు. గంజాయి సాగు చేసే వారికి రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అందబోవన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి మత్తు పదార్థాలు రాకుండా నిరోధించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు.