ఉత్కంఠతకు తెర..వైసీపీలో చేరనున్న వల్లభనేని వంశీ..?!

ఉత్కంఠతకు తెర..వైసీపీలో చేరనున్న వల్లభనేని వంశీ..?!

ఉత్కంఠతకు తెరపడింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం. నవంబర్ 3న వైసీపీ కండువా కప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవల  పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై  మనోవేధనకు గురైన వల్లభనేని వంశీ తన స్నేహితుడు బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. భేటీ అనంతరం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీతో వల్లభనేని వైసీపీలో, బీజేపీలో చేరుతారనే  ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.  కానీ ఆ ప్రచారానికి భిన్నంగా ఆయన   నిర్ణయం తీసుకున్నారు. యువనేతగా ఉండగానే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి, శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపారు వంశీ. తాను రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో ఆ లేఖలో వివరించారు.

ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండుసార్లు అవకాశమిచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు వంశీ. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ హయాంలో చాలా వరకు నేరవేర్చినా 2019 ఎన్నికల్లో అతికష్టం మీద గెలవాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల తర్వాత అనేక సమస్యలు చుట్టుముట్టాయని, రాజకీయంగా వేధింపులు పెరిగాయని, అనుచరులపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుచరులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే తాను రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని వల్లభనేని వంశీ లేఖలో వివరించారు.

అయితే తాజాగా వల్లభనేని వంశీ వైసీపీ లో చేరుతున్నారని  ప్రచారం జోరుగా సాగుతోంది.  అయితే వల్లభనేని రాకను గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు జగన్ తో భేటీ అయ్యేందుకు సాధ్యపడలేదు. ఒకవేళ వల్లభనేని వైసీపీలో చేరి ఉప ఎన్నికలొస్తే వెంకట్ రావు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.