మెట్రో స్టేషన్ల చుట్టూ చెత్తకుప్పలు.. ఇబ్బంది పడుతున్న ప్యాసింజర్లు

మెట్రో స్టేషన్ల చుట్టూ చెత్తకుప్పలు.. ఇబ్బంది పడుతున్న ప్యాసింజర్లు
  • ఎంట్రెన్స్ ల వద్ద పేరుకుపోతున్న వేస్టేజ్

హైదరాబాద్, వెలుగు : ప్రయాణికుల సౌకర్యాలకు ఎప్పటికప్పుడు సర్వీసును మెరుగుపరుచుకునే హైదరాబాద్ మెట్రో స్టేషన్లు.. ఇప్పుడు చెత్తకు కేరాఫ్ అడ్రస్​గా మారుతున్నాయి. నిర్వహణ లోపంతో కొన్ని స్టేషన్ల కింద ఏ మూలకు చూసినా చెత్తకుప్పలే కనిపిస్తున్నాయి. మెట్లు, లిఫ్ట్​కు వెళ్లే ఎంట్రెన్స్​ల వద్ద చెత్త పేరుకుపోవడం, కొందరు టాయిలెట్ చేస్తుండటంతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన నెలకొంది. దీంతో మెట్రో ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నారు. స్టేషన్ల కింద సెక్యూరిటీ నిర్వహణ లేకపోవడంతో ఇలాంటివి జరుగుతున్నాయని ప్యాసింజర్లు చెబుతున్నారు. జులైలో మెట్రో స్టేషన్ కింద ఇద్దరు వ్యక్తులు మద్యం తాగిన ఘటన, ఆ తర్వాత మరో స్టేషన్ లో యువకులు మద్యం తాగుతూ కనిపించిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనలు మెట్రో అధికారులపై విమర్శలకు దారి తీశాయి. అయితే, మెట్రోస్టేషన్లలోని పై ఫ్లోర్​లు చాలా బాగుంటాయని, స్టేషన్ల కింద మాత్రం చెత్త, దుర్వాసన ఉంటుందని ప్యాసింజర్లు చెబుతున్నారు. స్టేషన్ కింద కూడా ఎప్పుడూ సెక్యూరిటీని ఉండేలా చూడాలని, ఎప్పటికప్పుడు చెత్తను క్లీన్ చేయాలని, మెట్రోఅధికారులు దీనిపై దృష్టి సారించాలని  కోరుతున్నారు.

గుట్కా మరకలు, మురుగు నీరు...

చాలా మెట్రో స్టేషన్ల కింద ఏ మూల చూసిన  గుట్కా మరకలు కనిపిస్తున్నాయి. చెత్త, మట్టి కుప్పలు వాటి మీదే కొందరు టాయిలెట్ చేస్తున్నారు. దీంతో ఆ వైపు పోవాలంటేనే ప్యాసింజర్లు పరేషాన్ అవుతున్నారు. ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ కింద మెట్లకు వెళ్లే దారికి దగ్గరే దుర్వాసన వస్తుండటంతో ప్యాసింజర్లు అక్కడికి రాగానే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మొక్కల కోసం వదిలేసిన ఖాళీ జాగ చెత్తా చెదారంతో నిండిపోయింది. పంజాగుట్ట స్టేషన్ మెట్ల దారి వద్ద మట్టి కుప్ప ప్యాసింజర్లకు ఇబ్బందిగా మారింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.5 మెట్రో స్టేషన్​లో లిఫ్ట్ వద్దకు వెళ్లకుండా దారికి అడ్డుగా మురుగునీరు ఉండటంతో ప్యాసింజర్లు అవస్థ పడుతున్నారు. అటుగా వెళ్లే వాకర్స్​కు సైతం ఇబ్బంది తప్పట్లేదు.

ఒక్క సెకన్ కూడా నిలబడలేం

మెట్రో స్టేషన్ల కింద దుర్వాసన భరించలేం. ఒక్క క్షణం కూడా నిలబడలేం. కొన్ని చోట్ల మెట్రో స్టేషన్ల కింద రోజుల తరబడి మురుగు పారుతోంది. మెట్రో చార్జీలు మాత్రం ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలి.
-స్వరూప రాణి, ప్రైవేటు ఎంప్లాయ్