
- 6 వికెట్ల తేడాతో యూపీని ఓడించిన జెయింట్స్
- రాణించిన హర్లీన్ డియోల్, డాటిన్
వడోదర: కెప్టెన్ ఆష్లే గార్డ్‌నర్ (32 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 52; 2/39) మరోసారి ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో విజృంభించడంతో విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ తొలి విజయం ఖాతాలో వేసుకుంది. ఆర్‌సీబీతో మొదటి మ్యాచ్‌లో భారీ స్కోరును కాపాడుకోలేకపోయిన గుజరాత్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో మెప్పించి 6 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్‌కు వచ్చిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 143/9 స్కోరు చేసింది. కెప్టెన్ దీప్తి శర్మ (27 బాల్స్‌లో 6 ఫోర్లతో 39), ఉమా ఛెత్రి (24), అలానా కింగ్ (19 నాటౌట్) రాణించారు. గుజరాత్ బౌలర్లలో ప్రియా మిశ్రా మూడు, దియేంద్ర డాటిన్, ఆష్లే గార్డ్‌నర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం గార్డ్‌నర్ మెరుపులతో గుజరాత్ 18 ఓవర్లలోనే 144/4 స్కోరు చేసి గెలిచింది. హర్లీన్ డియోల్ ( 34 నాటౌట్), దియేంద్ర దాటిన్ (33 నాటౌట్) కూడా రాణించారు. గార్డ్‌నర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఆదుకున్న దీప్తి, ఉమ
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన యూపీ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. ఓపెనర్లు కిరణ్ నవ్‌గిరె (15), వ్రిందా (6) రెండు ఓవర్లలోనే తొలి వికెట్‌కు 22 రన్స్ జోడించారు. అదే స్కోరు వద్ద నవ్‌గిరెను డాటిన్, వ్రిందాను గార్డ్‌నర్ ఔట్ చేసినా.. ఉమా ఛెత్రి, కెప్టెన్ దీప్తి శర్మ క్రీజులో కుదురుకొని బౌండ్రీలు రాబట్టారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 51 రన్స్ జోడించారు.
అయితే పదో ఓవర్లో ఉమను పెవిలియన్ చేర్చిన డాటిన్ ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీసింది. తర్వాతి ఓవర్లోనే తహ్లియా మెక్‌గ్రాత్ (0)తో పాటు గ్రేస్ హారిస్ (4)ను ఔట్ చేసిన ప్రియా మిశ్రా.. యూపీని 79/5తో ఒత్తిడిలోకి నెట్టింది. ఈ టైమ్‌లో శ్వేతా సెహ్రావత్ (16)తో కలిసి దీప్తి ఒక్కో పరుగు జోడిస్తూ స్కోరు వంద దాటించింది. దీప్తి, శ్వేతతో పాటు సోఫీ ఎకిల్‌స్టోన్ (2) ఔటైనా.. చివరి రెండు ఓవర్లలో అలానా కింగ్, సైమా ఠాకూర్ (15) ధాటిగా ఆడటంతో యూపీ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.
గార్డ్‌నర్ ధనాధన్
చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో గుజరాత్‌కు ఆరంభంలోనే వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి రెండు ఓవర్లలో ఓపెనర్ బెత్ మూనీ (0)తో పాటు హేమలత (0) డకౌటవ్వడంతో 2/2తో డీలా పడింది. కానీ, మరో ఓపెనర్ లారా వోల్‌వర్ట్ (22), ఇన్‌ఫామ్ బ్యాటర్, కెప్టెన్ గార్డ్‌నర్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. గత మ్యాచ్ ఫామ్‌ను కొనసాగించిన గార్డ్‌నర్ భారీ షాట్లతో అలరించింది. మూడో వికెట్‌కు వోల్‌వర్ట్‌తో 55 రన్స్ జోడించడంతో గుజరాత్ కోలుకుంది.
తొమ్మిదో ఓవర్లో వోల్‌వర్ట్‌ను ఎకిలిన్‌స్టోన్ బౌల్డ్ చేసినా తన జోరు కొనసాగించిన గార్డ్‌నర్ 28 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసు కుంది. 12వ ఓవర్లో ఆమెను తహ్లియా పెవిలియన్ చేర్చడంతో యూపీ రేసులోకి వచ్చేలా కనిపించింది. కానీ, హర్లీన్ డియోల్, దియేంద్ర డాటిన్ ప్రత్యర్థికి ఆ చాన్స్ ఇవ్వలేదు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడుతూ టార్గెట్‌ను కరిగించారు. ముఖ్యంగా డాటిన్ భారీ షాట్లతో ఆకట్టుకోవడంతో మరో రెండు ఓవర్లు మిగిలుండగానే గుజరాత్ విజయాన్ని అందుకుంది.
సంక్షిప్త స్కోర్లు
యూపీ: 20 ఓవర్లలో 143/9 (దీప్తి శర్మ 39, ఉమా చెత్రి 24, ప్రియా మిశ్రా 3/25)
గుజరాత్: 18 ఓవర్లలో 144/4 (గార్డ్‌నర్ 52, హర్లీన్ 34 నాటౌట్, ఎకిల్‌స్టోన్ 2/16)
డబ్ల్యూపీఎల్‌లో నేడు
ఢిల్లీ x బెంగళూరు రా. 7.30 నుంచి