పాతబస్తీలో తప్పిన పెను ప్రమాదం.. పరుగులు తీసిన జనం.. ఏం జరిగిందంటే..?

పాతబస్తీలో తప్పిన పెను ప్రమాదం.. పరుగులు తీసిన జనం.. ఏం జరిగిందంటే..?

పాతబస్తీలో ఓ రోడ్డుపై అకస్మాత్తుగా ఓ ఆటో ఆగింది.. మొదట డ్రైవర్ భయంతో ఆటో దిగి పారిపోయాడు. అంతలోనే ఆటో వెనుక వాహనాలను యజమానులు వదిలేసి పరుగులు పెట్టారు. రోడ్డుపై ఉన్న స్థానికులు కూడా.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు. చివరకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

పరుగులు పెట్టడానికి కారణం..

హైదరాబాద్ పాతబస్తీలో సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట ప్రధాన రహదారిపై సిలిండర్ల లోడ్ తో ఆటో వెళ్తోంది. ఇంతలో ఆటోలోని గ్యాస్ సిలిండర్ లీకైంది. దీంతో ఆటోను రోడ్డుపై వదిలిపెట్టి  డ్రైవర్‌ పారిపోయాడు. ఆటోలో ఉన్న గ్యాస్ సిలిండర్ల నుంచి గ్యాస్‌ లీక్‌ కావడంతో ప్రాణభయంతో వాహనాలు వదిలి జనాలు పరుగులు తీశారు. దాంతో చాంద్రాయణగుట్ట ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అయితే గ్యాస్‌ లీకైన సమయంలో ఆటోలో 12 పెద్ద సిలిండర్లు ఉన్నాయి.

సమాచారం అందుకున్న ఫలక్ నుమా ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనదారులను దూరంగా పంపారు. సిలిండర్ లను ఆటో నుంచి దింపారు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే.. చర్యలు చేపట్టారు. ఆ తర్వాత ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. పోలీసుల సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పిందంటూ.. స్థానికులు అభినందించారు.