- క్యూపై ఏఐ ఫౌండర్ నాగేంద్ర తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ బిలియనీర్
- రూ.9,600 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్న బిలియనీర్లు 391 మంది
- రూ.వెయ్యి కోట్లకుపైగా ఉన్న వాళ్లు 1,810 మంది
- హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్నుడిగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. రీసెర్చ్ సంస్థ ఎం3ఎం హురున్ ఇండియా తాజాగా రిచ్ లిస్ట్ 2026 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం, వీరి సంపదల మధ్య రూ.59,400 కోట్ల తేడా ఉంది.
అదానీ సంపద 2025తో పోలిస్తే ఈ ఏడాది 13 శాతం పెరిగి ఏకంగా రూ.9.23 లక్షల కోట్లకు (96 బిలియన్ డాలర్లు) చేరుకుంది. మరోవైపు అంబానీ సంపద 10 శాతం తగ్గి రూ.8.63 లక్షల కోట్లకు పరిమితమైంది. గత ఐదేళ్ల నుంచి నంబర్ వన్ స్థానం కోసం వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
ఇండియాలో అత్యంత ధనవంతుడిగా 2022లో అదానీ నిలవగా, 2023లో అంబానీ నిలిచారు. మళ్లీ 2024లో అదానీ, 2025లో అంబానీ టాప్‌లోకి రాగా.. ఇప్పుడు 2026లో మళ్లీ అదానీ నంబర్ వన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
మూడోస్థానంలో లక్ష్మీ మిట్టల్
* యూరప్‌లో ఉక్కు ధరలు పెరగడంతో ఆర్సెలర్ మిట్టల్ కంపెనీని నడుపుతున్న లక్ష్మీ నవీన్ మిట్టల్ కుటుంబ సంపద ఏకంగా 93% ఎగ బాకి రూ.3.39 లక్షల కోట్లకు చేరింది. ఈ లిస్ట్‌లో మిట్టల్ కుటుంబానికి మూడోస్థానం దక్కింది.
* సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా సంపద 23 % పెరిగి రూ.3.03 లక్షల కోట్లకు చేరగా, ఆయన 4వ స్థానంలో నిలిచారు.
* హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా రూ.2.79 లక్షల కోట్లతో 5వ స్థానంలో నిలవడమే కాకుండా, దేశంలోనే అత్యంత ధనిక మహిళగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
* ఆ తర్వాతి స్థానాల్లో కుమార్ మంగళం బిర్లా (రూ.2.69 లక్షల కోట్లు), సన్ ఫార్మా దిలీప్ సంఘ్వీ (రూ.2.65 లక్షల కోట్లు), విప్రో అజీమ్ ప్రేమ్‌జీ (రూ.2.63 లక్షల కోట్లు) ఉన్నారు.
* వేదాంత అధినేత అనిల్ అగర్వాల్ కుటుంబం రూ.2.08 లక్షల కోట్ల సంపదతో తొమ్మిదో స్థానంలో నిలిచారు. జేబీ కెమికల్స్ విలీనంతో టోరెంట్ ఫార్మా సమీర్ మెహతా కుటుంబం రూ.1.89 లక్షల కోట్ల సంపదతో పదో స్థానాన్ని దక్కించుకుంది.
మొత్తం సంపద జీడీపీలో సగం!
భారత్‌లో సంపన్నుల సంఖ్య సరికొత్త గరిష్టానికి చేరింది. దేశంలో డాలర్ బిలియనీర్ల (సుమారు రూ.9,600 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉన్నవారి) సంఖ్య రికార్డు స్థాయిలో 391కి పెరిగింది. ఈ ఏడాదిలోనే కొత్తగా 27 మంది బిలియనీర్లు చేరారు.
ఐదేళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 237గా ఉండేది. కనీసం రూ.వెయ్యి కోట్ల సంపద కలిగిన వారి సంఖ్య దేశంలో 1,810కి పెరిగింది. వీరి మొత్తం సంపద విలువ రూ.187.5 లక్షల కోట్లు (దాదాపు 1.96 ట్రిలియన్ డాలర్లు). ఇది భారతదేశ మొత్తం జీడీపీలో దాదాపు సగానికి సమానం.
టెక్నాలజీ, స్టార్టప్‌ల జోరు
* తొలిసారిగా ఏఐ రంగాన్ని ప్రత్యేక కేటగిరీగా గుర్తించగా, ఇందులో 19 మంది స్థానం సంపాదించారు. వీరి మొత్తం సంపద రూ.3.07 లక్షల కోట్లుగా ఉంది. బెంగళూరుకు చెందిన క్యూపై ఏఐ ఫౌండర్ నాగేంద్ర నాగరాజ రూ.1,700 కోట్ల సంపదతో దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ బిలియనీర్‌గా జాబితాలోకి వచ్చారు.
* రిచ్ లిస్ట్లో ఉన్నవారిలో దాదాపు 70 శాతం మంది (1,266 మంది) సొంత ఆలోచనలతో, స్వయంకృషితో ఎదిగిన సెల్ఫ్ మేడ్ పారిశ్రామికవేత్తలే!
* జెప్టో కో–ఫౌండర్ కైవల్య వోహ్రా (23 ఏళ్లు), ఆదిత్ పాలిచా (24 ఏళ్లు) ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కులు.
* దేశ ఆర్థిక రాజధాని ముంబై 465 మంది శ్రీమంతులతో నంబర్ వన్ వెల్త్ హబ్‌గా కొనసాగుతుండగా, న్యూఢిల్లీ 236 మందితో రెండో స్థానంలో, బెంగళూరు 129 మందితో మూడో స్థానంలో ఉన్నాయి.
