ప్రభుత్వ పథకాల ప్రచారమే డ్యూటీ
ఫాలోవర్ల సంఖ్యను బట్టి గౌరవ వేతనం
కొత్త పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం
తొలి ఏడాది ఎంప్యానెల్‌మెంట్
పనితీరుతో మరో రెండేళ్ల పొడిగింపు
హైదరాబాద్ , వెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం ‘సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాలసీ’ని తీసుకొచ్చింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు వాటిపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఇన్‌ఫ్లుయెన్సర్లను ధ్రువీకరించి ఎంప్యానెల్ చేసేలా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ పాలసీ ( ఎస్‌ఎమ్ఐఎస్)ని రూపొందించేందుకు బుధవారం ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
గవర్నమెంట్ స్కీమ్‌లు, మౌలిక వసతుల అభివృద్ధి, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశమని సమాచార శాఖ మంత్రి పార్థసారధి వెల్లడించారు. డిజిటల్ ప్రచారం, ప్రజా సమాచారాన్ని బలోపేతం చేయడానికి సమాచార శాఖ, ఏపీడీసీఎల్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లతో సమావేశాలు నిర్వహించి, వీటి ఆధారంగా ఇతర 6 రాష్ట్రాల విధానాలను పరిశీలించి ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీ ముసాయిదాను రూపొందిస్తామని
వెల్లడించారు.
ఏడాదిపాటు ఎంప్యానెల్
ఈ విధానం ప్రకారం, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికల్లో ఉన్న కంటెంట్ క్రియేటర్లను వారి ఫాలోవర్ల సంఖ్య, రీచ్ ఆధారంగా వివిధ కేటగిరీలుగా వర్గీకరించి ప్రభుత్వం నెలవారీ చెల్లింపులు చేస్తుంది.
సమాచారం నిష్పాక్షికంగా, వాస్తవాధారితంగా, ప్రజా ప్రయోజనకరంగా ఉండాలి.
ప్రారంభ ఎంప్యానెల్‌మెంట్ ఒక సంవత్సరం ఉంటుంది.
వీరి పనితీరు ఆధారంగా అధికార సంస్థ నిర్ణయంతో మరో రెండేండ్ల వరకు, ఒక్కోసారి ఒక సంవత్సరం చొప్పున
పొడిగించవచ్చు.
పారితోషికాలు ఇలా..
ఫాలోవర్లు వేతనం
లక్షకు పైగా రూ. 15 వేలు
50 వేల నుంచి 99,999 రూ. 7,500
25 వేల నుంచి 49,999 రూ. 5,000
10 వేల నుంచి 24,999 రూ. 2,500
