10 నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు చెప్పాం
ఫారం-6, డేటా కేంద్రీకరణను వ్యతిరేకించాం
జ్ఞానేశ్తో విభేదించిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు
సీఈసీని అరెస్టు చేయాలన్న మమతా బెనర్జీ
బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈసీ కలిసి ఓట్ చోరీ:
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శ
ఎన్నికల కమిషన్ బీజేపీ కోసం పనిచేస్తున్నది: తేజస్వి
ఎన్నికల్లో గెలవలేక రాజ్యాంగ సంస్థలపై దాడులా: బీజేపీ
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తీవ్ర వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా ఈ అంశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వన్ మ్యాన్ షో ధోరణి, మిగతా కమిషనర్ల అసంతృప్తి వంటి అంశాలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేసే పేరుతో ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియ ఇప్పటికే దేశంలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. లక్షలాది మంది ఓటర్ల పేర్లు గల్లంతవడం, ఫారమ్-6 మార్పులు, లాజికల్ డిస్క్రిపెన్సీ పేరిట పంపిస్తున్న నోటీసులు సాధారణ ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అర్హులైన నిజమైన ఓటర్లను కూడా ఓటరు జాబితా నుంచి తొలగించేందుకే ఈ కసరత్తు జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
చర్చనీయాంశంగా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం
సర్విషయంలో ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో.. కమిషన్ లోపలే విభేదాలు తలెత్తినట్టు సమాచారం. ముగ్గురు సభ్యులున్న ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు, మిగిలిన ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఓ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది.
తమకు తెలియకుండా, తమ ప్రమేయం లేకుండానే సీఈసీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ మిగిలిన ఇద్దరు కమిషనర్లు గత 10 నెలల్లో కనీసం 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు తెలిపినట్టు ఆ కథనం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఓటర్ల ప్రత్యేక సవరణ (సర్), ఓటర్ల డేటా కేంద్రీకరణ, ఫారమ్-6 మార్పులు వంటి కీలక అంశాలపైనే వీరు ఈ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు ఆ పత్రిక వెల్లడించింది. ఈ పత్రిక ప్రచురించిన కథనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పరిణామాలన్నీ ఈసీ పనితీరుపై తీవ్రమైన సందేహాలకు, అనుమానాలకు తావిస్తున్నాయి.
‘జ్ఞానేశ్ గేట్’ అంటూ ప్రతిపక్షాల విమర్శ
ఈసీపై పత్రికలో కథనం ప్రచురితమైన అనంతరం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం అంటే ముగ్గురు కమిషనర్లు కూర్చుని సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని.. కానీ, సీఈసీ మాత్రం మిగతా ఇద్దరిని సంప్రదించకుండానే 'వన్ మ్యాన్ షో'లా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయిందని, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల (మోదీ, అమిత్ షా) ఆదేశాల మేరకే సర్ ప్రక్రియ కొనసాగుతోందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ తీవ్ర ఆరోపణలు గుప్పించాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రతిపక్షాలు ‘జ్ఞానేశ్ గేట్’ గా అభివర్ణించాయి.
నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా జరిగినవే: ఈసీ
సర్ అంశంలో ఈసీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనంపై బుధవారం పోల్ బాడీ స్పందించింది. గత ఏడాది కాలంలో తాము తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే జరిగాయని స్పష్టం చేసింది. ఏ సంస్థలోనైనా చర్చల సమయంలో భిన్నాభిప్రాయాలు, పరిశీలనలు సర్వసాధారణమని.. అయితే, తుది నిర్ణయాలు మాత్రం అన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నామని బుధవారం ఓ ప్రకటనలో సమర్థించుకుంది.
ముసాయిదా దశలో అధికారులు లేదా కమిషనర్లు ఇచ్చే సలహాలు కేవలం పరిపాలనాపరమైన భాగమేనని ఈసీ స్పష్టం చేసింది. కేవలం 10 నెలల కాలానికి సంబంధించిన కొన్ని అంతర్గత నోట్లను, పరిశీలనలను మాత్రమే హైలైట్ చేస్తూ.. ఆమోదాలు, నిర్ణయాలు, ఆదేశాలు, ఇతర పెద్ద సంఖ్యలోని కార్యక్రమాలను విస్మరించడం ద్వారా ఆ నివేదిక సమగ్ర చిత్రాన్ని ఇవ్వలేదని ఈసీ పేర్కొంది. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా సర్సహా దాదాపు 40 కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టామని, వీటన్నింటినీ పూర్తి కమిషన్ ఏకగ్రీవంగానే ఆమోదించిందని స్పష్టం చేసింది.
