హుస్నాబాద్, వెలుగు: ‘విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా నాకు చెప్పే హక్కుంది.. నేను మీ గార్డియన్‌గా ఉంటా’ అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, హాస్టల్ గదులను పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను స్వయంగా నోట్‌బుక్‌లో రాసుకుంటూ.. విద్యార్థులకు తాను గార్డియన్‌లా ఉంటానని, ఏ సమస్య వచ్చినా చెప్పాలని భరోసా కల్పించారు.
హాస్టల్‌లో నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని, ప్రతిరోజూ ఒక స్టాఫ్ మెంబర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కాలేజీ టాపర్లకు ల్యాప్‌టాప్‌లు, దూర ప్రాంతాల పేద విద్యార్థులకు సైకిళ్లు అందిస్తామని, బాయ్స్ హాస్టల్ బాత్రూమ్ సమస్యలు, బస్సు, లైబ్రరీ సౌకర్యాలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఓయూ, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్లతో మోటివేషన్ క్లాసులు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ తీసుకొస్తామని తెలిపారు.
విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉండి, లక్ష్య సాధనపై పూర్తి దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో హుస్నాబాద్ 16వ వార్డులో రూ.20 లక్షలతో నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ భవనానికి మంత్రి భూమిపూజ చేశారు. వినాయక నవరాత్రుల సందర్భంగా ఆర్టీసీ బస్ డిపో కాలనీ, హనుమాన్ నగర్‌లోని గణేశ్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇటీవల మృతి చెందిన ప్రతాపగిరి రాజేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు. మంత్రి వెంట శాతవాహన వీసీ ఉమేశ్, రిజిస్ట్రార్ సతీశ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి, చైర్మన్ లింగమూర్తి, తదితరులున్నారు.
