హైదరాబాద్‌‌కు 3 లక్షల ఏండ్ల చరిత్ర ! కొంగర ఖుర్దు అటవీ ప్రాంతంలో పాతరాతియుగం నాటి రాతి పనిముట్లు

హైదరాబాద్‌‌కు 3 లక్షల ఏండ్ల చరిత్ర ! కొంగర ఖుర్దు అటవీ ప్రాంతంలో పాతరాతియుగం నాటి రాతి పనిముట్లు
  • కొంగర ఖుర్దు అటవీ ప్రాంతంలో పాతరాతియుగం నాటి రాతి పనిముట్లు
  • క్వార్ట్జ్‌‌ రాతి చేతిగొడ్డలి, వడిసెల రాయి లభ్యం

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్‌‌ నగర పరిసరాల్లో ఆదిమానవులు సంచరించినట్లుగా పాతరాతియుగం నాటి రాతి పనిముట్లు లభ్యమయ్యాయి. సిటీకి మూడు లక్షల ఏండ్ల ప్రాచీన చరిత్ర ఉందనడానికి ఆధారాలు దొరికాయి.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరకలాన్‌‌కు ఆనుకుని ఉన్న కొంగర ఖుర్దు ‘బి’ రిజర్వ్‌‌ ఫారెస్ట్‌‌లో నాటి మానవులు ఉపయోగించిన క్వార్ట్జ్‌‌ రాతి చేతిగొడ్డలితోపాటు వడిసెల రాయి వెలుగుచూశాయి. క్లైమేట్‌‌ ఫ్రంట్‌‌ తెలంగాణ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, మారేడు ఎన్విరాన్‌‌మెంటల్‌‌ సర్వీసెస్‌‌ కో-ఫౌండర్‌‌ మీర్‌‌ ఒమర్‌‌ అలీ ఖాన్‌‌, వన్యప్రాణి సంరక్షకుడు శ్రీపతి వైష్ణవ్‌‌తో కలిసి అటవీ ప్రాంతంలో పరిశోధన చేపట్టారు.

కొంగర ఖుర్దు ‘బి’ అటవీ ప్రాంతంలో గాలించగా ప్రాచీన మానవుడు వేట కోసం చెక్కిన క్వార్ట్జ్‌‌ రాతి చేతిగొడ్డలి, వడిసెల రాయి లభించాయి. పాతరాతియుగంలో ఆదిమానవులు దూరంగా ఉన్న జంతువులు, పక్షులను వేటాడేందుకు వడిసెల రాళ్లను వాడేవారని చెప్పడానికి ఇదొక సాక్ష్యమని పరిశోధకులు పేర్కొన్నారు.

గతంలో మీర్‌‌ ఒమర్‌‌ అలీ ఖాన్‌‌ గండిపేట సమీపంలోని మంచిరేవుల ఫారెస్ట్‌‌ ట్రెక్‌‌ పార్కులో బీరప్పగుట్ట వద్ద క్వార్ట్జ్‌‌ రాతితో చేసిన చేతిగొడ్డళ్లు, పాయింట్లను గుర్తించారు. కొంగర ఖుర్దులోనూ అదే తరహా పనిముట్లు దొరకడంతో హైదరాబాద్​లో మూడు లక్షల సంవత్సరాల కిందటే మానవ ఆవాసాలు ఉన్నట్లు స్పష్టమవుతుందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌‌ రామోజు హరగోపాల్‌‌ తెలిపారు.