బ్యాటింగ్ చేసే జట్టే అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంచుకున్నట్లుంది.. సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు

బ్యాటింగ్ చేసే జట్టే అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంచుకున్నట్లుంది.. సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు
  • తుది నిర్ణయం సీజేఐ ముందుంచాలన్న జస్టిస్ దత్తా
  • ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసు రిఫర్
  • విచారణ వేళ సుప్రీంకోర్టు జడ్జీల మధ్య భిన్నాభిప్రాయాలు

న్యూఢిల్లీ: భారత ఎన్నికల ప్రధాన అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన ఈసీఐ (2023) చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసింది. ఈ పిటిషన్లలో రాజ్యాంగపరమైన ప్రశ్నలు ఉత్పన్నమైన నేపథ్యంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనమే విచారణ జరపగలదని పేర్కొంది. ఎన్నికల ప్రధాన అధికారి, కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. 

ఈ చట్టం ప్రకారం.. ప్రధానమంత్రి, కేంద్రమంత్రితో పాటు లోక్ సభ ప్రతిపక్ష నేత ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ మెజారిటీ ఆధారంగా వీరి నియామకం చేపడుతుంది. అయితే, ఈ కొత్త చట్టం ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని, దీనివల్ల ఎన్నికల సంఘం స్వతంత్రత దెబ్బతింటుందని పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్, పలు సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఈసీ, సీఈసీల నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) కూడా ఉండాలని గుర్తుచేశాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ కొత్త చట్టంలో సీజేఐని తప్పించి ఆ స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చిందని ఆరోపించాయి. ప్రధాన మంత్రి ప్రతిపాదించిన వ్యక్తి పేరును వ్యతిరేకించే పరిస్థితి ఆయన నేతృత్వంలో పనిచేసే కేంద్ర మంత్రికి ఉండదని పిటిషనర్లు గుర్తుచేశారు. 

అంతిమంగా ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి మేలు చేసేలా ఉందని, తమకు నచ్చిన వారిని ఎలక్షన్ కమిషన్ సభ్యులుగా ఎంపిక చేసే అవకాశం ఉంటుందని ఆరోపించారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎలక్షన్ కమిషన్‎ను నడిపించే వ్యక్తుల ఎంపికలో పక్షపాతానికి తావివ్వకూడదనే రాజ్యాంగ ప్రాథమిక ఉద్దేశానికి ఇది వ్యతిరేకమని పిటిషనర్లు వాదించారు.

విచారణపై జడ్జీల భిన్నాభిప్రాయం

ఈ పిటిషన్లను జస్టిస్‌‌‌‌ దీపంకర్‌‌‌‌ దత్తా, జస్టిస్‌‌‌‌ సతీశ్‌‌‌‌ చంద్ర శర్మలతో కూడిన బెంచ్‌‌‌‌ బుధవారం విచారణ చేపట్టింది. 2023 చట్టంపై ఉత్పన్నమైన ప్రశ్నల తీవ్రత నేపథ్యంలో దీనిని రాజ్యాంగ ధర్మాసనానికి పంపించాలని నిర్ణయించారు. అయితే, ఎంతమంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలనే విషయంపై ఈ ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయం వ్యక్తంచేశారు. 

చట్టం ప్రకారం.. రాజ్యాంగపరమైన పెద్ద ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు ఐదుగురు సభ్యుల ధర్మాసనానికే వెళ్లాలని రాజ్యాంగంలోని 145(3) వ నిబంధన చెబుతోందని జస్టిస్‌‌‌‌ సతీశ్‌‌‌‌ చంద్ర శర్మ అన్నారు. జస్టిస్‌‌‌‌ దీపంకర్‌‌‌‌ దత్తా స్పందిస్తూ.. ఈ చట్టం ఎన్నికల స్వేచ్ఛను దెబ్బతీస్తోందా లేదా అనే విషయాన్ని ద్విసభ్య ధర్మాసనం తేల్చగలదని చెప్పారు. ఇది ఎలా ఉందంటే.. బ్యాటింగ్ చేసే జట్టే అంపైర్​ను ఎంపిక చేసుకున్నట్లు ఉందని జస్టిస్ దత్తా వ్యాఖ్యానించారు.

ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై విచారణలో జాప్యాన్ని నివారించేందుకు నేరుగా ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి పంపుతున్నట్లు జడ్జిలు ఇద్దరూ ఏకగ్రీవంగా ప్రకటించారు. దీనిపై తుది నిర్ణయంకోసం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ముందుంచాలని ఆదేశాలిచ్చారు. కాగా, ఒక మంత్రి ప్రధాని మాటకు ఎదురు చెప్పడం కష్టం కనుక ఈ కమిటీ అధికార పక్షానికే ఎక్కువ అధికారం ఇస్తుందని జస్టిస్ దత్తా తన అభిప్రాయంలో పేర్కొన్నారు. అయితే, ఇవన్నీ కేవలం ప్రాథమిక ఆలోచనలు మాత్రమేనని, చట్టం మంచిదా చెడ్డదా అనే అసలు నిజం మాత్రం పెద్ద ధర్మాసనం విచారణ జరిపిన తర్వాతే తేలుతుందని ఆయన పేర్కొన్నారు.