ఐటీ కారిడార్కు ఉన్నతాధికారులు.. రోడ్లపై వర్షపు నీటి నిల్వ, ట్రాఫిక్ రద్దీపై సమీక్ష

ఐటీ కారిడార్కు ఉన్నతాధికారులు.. రోడ్లపై వర్షపు నీటి నిల్వ, ట్రాఫిక్ రద్దీపై సమీక్ష
  • హాజరైన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్​

గచ్చిబౌలి, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఐటీ కారిడార్ లోని పలు ప్రాంతాలు నీటమునిగి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఈ సమస్యపై సీఎం రేవంత్​రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, అన్నీ శాఖలు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు.

 దీంతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​రెడ్డి అధ్యక్షతన డీజీపీ సీవీ ఆనంద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ మున్సిపల్​ కమిషనర్ సృజన, సైబరాబాద్​సీపీ రమేశ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, సీఎంసీ, ఇరిగేషన్, హైడ్రా, ఇంజినీరింగ్​శాఖల ఉన్నతాధికారులు మంగళవారం ఐటీ కారిడార్​లో పర్యటించారు. 

రాయదుర్గం మల్కం చెరువు వద్ద షేక్​పేట్ రహదారిపై వరద నిలిచే ప్రాంతాన్ని, ఆ తర్వాత గచ్చిబౌలి ఎలక్షన్ ఆఫీస్ వద్ద ఉన్న ఖాజాగూడ చెరువుకు వెళ్లే నాలాను, కొండాపూర్​లోని సంతోష్ దాబా వద్ద నాలాను పరిశీలించారు. వర్షపునీరు సజావుగా వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం ఖానామేట్​ మొండికుంటను సందర్శించారు. అక్కడి నుంచి మియాపూర్ గురునాథం చెరువు వద్దకు చేరుకొని జేపీనగర్​నుంచి వచ్చే నాలాను తనిఖీ చేశారు. అంతకుముందు మల్కం చెరువు వద్ద ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో డీజీపీ ఆనంద్​మాట్లాడారు.

 నగరంలోని లోతట్టు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ మార్గాల్లో పోలీస్​సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ఐటీ కారిడార్​లో వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖలు సమష్టిగా పనిచేసి సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.