గంజాయి ఉంది కావాలా.. ఐటీ కారిడార్ లో సాగు.. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఘటన

గంజాయి ఉంది కావాలా.. ఐటీ కారిడార్ లో  సాగు.. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఘటన
  •     అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు చిక్కిన వ్యక్తి

గచ్చిబౌలి, వెలుగు : ఇప్పటి వరకు ఆంధ్ర, ఒడిశా, మహరాష్ర్ట ప్రాంతాల నుంచి హైదరాబాద్, ఐటీ కారిడార్​కు గంజాయి ట్రాన్స్​పోర్ట్​అయ్యేది. ప్రస్తుతం ఏకంగా ఐటీ కారిడార్​లో గంజాయి మొక్కను సాగు చేస్తున్నారు. తన వద్ద గంజాయి ఉందని కావాలా అంటూ అమ్మకానికి పెట్టాడు. పోలీసులకు సమాచారం అందడంతో సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్​ చేశారు.

ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....గోపన్​పల్లి ఎన్టీఆర్​నగర్​లోని టాటా ఇనిస్టిట్యూట్​ ఆప్​ ఫండమెంటల్​ రిసెర్చ్​ ఇనిస్టిట్యూట్​ సమీపంలో గోగినని సత్యనారాయణ(55) నివాసం ఉంటూ వాచ్​మెన్​గా పనిచేస్తున్నాడు. వాచ్​మెన్​గా పనిచేస్తుండగా వచ్చే జీతం సరిపోకపోవడంతో గంజాయి సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్కను సాగు చేస్తున్నాడు. తన వద్ద గంజాయి ఉందని, కావాలా అంటూ స్థానికంగా పలువురికి అమ్మేందుకు ప్రయత్నించాడు.

గంజాయిపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు గురువారం సత్యనారాయణ ఇంటి ఆవరణలో తనిఖీ చేయగా గంజాయి మొక్కను గుర్తించారు. గంజాయి మొక్కను స్వాధీనం చేసుకొని సత్యనారాయణపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.