గంభీర్‌‌‌‌‌‌‌‌పై సీనియర్ల గుర్రు..కోచింగ్‌‌‌‌‌‌‌‌ శైలిపై తీవ్ర అసంతృప్తి.. బీసీసీఐ పెద్దలకు ఫిర్యాదు

గంభీర్‌‌‌‌‌‌‌‌పై సీనియర్ల గుర్రు..కోచింగ్‌‌‌‌‌‌‌‌ శైలిపై తీవ్ర అసంతృప్తి.. బీసీసీఐ పెద్దలకు ఫిర్యాదు

న్యూఢిల్లీ: శ్రీలంక టూర్‌‌‌‌‌‌‌‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీమిండియాలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. కీలక ప్లేయర్లు గాయాల బారిన పడటంతో కోచింగ్‌‌‌‌‌‌‌‌ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు రాగా, ఇప్పుడు ఏకంగా హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ గౌతమ్‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌ వ్యవహార శైలిపై కూడా భిన్నమైన స్వరాలు వినిపిస్తున్నాయి. గౌతీ కోచింగ్‌‌‌‌‌‌‌‌ శైలిపై కొంతమంది సీనియర్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అపెక్స్‌‌‌‌‌‌‌‌ కమిటీకి వాళ్లంతా అనధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా గంభీర్‌‌‌‌‌‌‌‌ జట్టును నడిపిస్తున్న తీరుపైనే ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి.  దాంతో ఈ నెల 15 నుంచి లంకతో జరిగే రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల టెస్ట్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌లో గంభీర్‌‌‌‌‌‌‌‌ కోచింగ్‌‌‌‌‌‌‌‌పైనే బీసీసీఐ పెద్దలు ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నారు. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా అతని పదవి ఊడటం ఖాయమేనని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

తప్పంత మాదేనా..

ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ వారసుడిగా పగ్గాలు చేపట్టిన గంభీర్‌‌‌‌‌‌‌‌ తొలినాళ్లలో తన కోచింగ్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. దాని ఫలితంగా గతేడాది టీమిండియా చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ , ఆసియా కప్‌‌‌‌‌‌‌‌, టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ను సాధించింది. కానీ రెడ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో మాత్రం గౌతీ కోచింగ్‌‌‌‌‌‌‌‌ విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వదేశంలో జరిగిన టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో టీమిండియా.. న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌, సౌతాఫ్రికా చేతిలో వైట్‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌కు గురైంది. ఇటీవల ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌, ఇంగ్లండ్ చేతిలో కూడా క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. అయితే ఈ ఓటములకు బాధ్యత తీసుకోకుండా ఇతరులపై నింద వేయడంతో సీనియర్లకు, గంభీర్‌‌‌‌‌‌‌‌ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. ‘ఓటములకు కోచింగ్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది సమష్టి బాధ్యత వహించడం లేదు. విఫలమైన ప్లేయర్లపై నెట్టేస్తున్నారు. లేదంటే బయటి వ్యక్తులకు ఈ పరాజయాలను ఆపాదిస్తున్నారు. విజయాలు వచ్చినప్పుడు మాత్రం స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా గంభీర్‌‌‌‌‌‌‌‌ కోచింగ్‌‌‌‌‌‌‌‌లో జవాబుదారీతనం లేదు’ అని కొంతమంది సీనియర్లు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో అపెక్స్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ మెంబర్స్‌‌‌‌‌‌‌‌ను వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి చర్చ జరగకపోయినా.. టీమిండియా డ్రెస్సింగ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌లో మాత్రం పరిస్థితి అంత బాగా లేదని మరికొందరు వెల్లడించారు. మరోవైపు ప్లేయర్లలోనూ కొందరు గంభీర్‌‌‌‌‌‌‌‌కు మద్దతుగా నిలుస్తున్నారని కూడా సమాచారం. 

లంక టూర్‌‌‌‌‌‌‌‌లో రాణిస్తేనే..

వరల్డ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూటీసీ) నేపథ్యంలో లంక టూర్‌‌‌‌‌‌‌‌.. టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. ఫైనల్‌‌‌‌‌‌‌‌ రేసులో నిలవాలంటే ఈ రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ గెలవాలి. కాబట్టి గంభీర్‌‌‌‌‌‌‌‌ కోచింగ్‌‌‌‌‌‌‌‌ ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ పెరిగింది. ఒకవేళ పాత పద్ధతిలో వెళ్తే మాత్రం సీనియర్ల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురయ్యే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. ఇప్పటికే చాలా మంది ప్లేయర్లు గాయాలతో టీమ్‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యారు. కాబట్టి అందుబాటులో ఉన్న ప్లేయర్లతో అనుకున్న ఫలితాలను రాబట్టడం గంభీర్‌‌‌‌‌‌‌‌కు కత్తి మీద సవాలే. ఒకవేళ లంక టూర్‌‌‌‌‌‌‌‌లో ప్రతికూల ఫలితాలు వస్తే గంభీర్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ కోచింగ్‌‌‌‌‌‌‌‌ ప్రశ్నార్థకంగా మారనుంది. 2027 వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ వరకు కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ ఉన్నప్పటికీ డ్రెస్సింగ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌ వాతావరణాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత పూర్తిగా బీసీసీఐపైనే ఉంది. అది జరగాలంటే గంభీర్‌‌‌‌‌‌‌‌ తన కోచింగ్‌‌‌‌‌‌‌‌తో బోర్డును సంతృప్తి పర్చాల్సిందే. గంభీర్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌గా వచ్చిన తర్వాతే ఇండియా తొలిసారి డబ్ల్యూటీసీ 2023–25 ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరకుండా నిష్క్రమించింది. అంతకుముందు రెండుసార్లు ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరి రన్నరప్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకుంది.

ఒత్తిడి ఉంది..

తనపై వస్తున్న విమర్శలపై కూడా గంభీర్‌‌‌‌‌‌‌‌ స్పందించాడు. ఉన్నత స్థాయి పదవిలో ఉన్నప్పుడు ఒత్తిళ్లు ఉండటం సహజమేనని అన్నాడు. అయితే నిజాయితీ, నిబద్ధతతో తన పని చేసుకుంటూ పోతానని స్పష్టం చేశాడు. ‘నాయకత్వంలో, నేర్చుకోవడంలో తప్పులు చేయడం సహజం. నేను కూడా ఓ మనిషినే. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. నేనైనా, ప్లేయర్లైనా చేసిన తప్పులను ఎదుర్కొవడానికి కొన్నిసార్లు సిద్ధపడాల్సిందే. గత 18 నెలల్లో  నేను తప్పులు చేసి ఉండొచ్చు. దాని గురించి సిగ్గుపడను. కానీ నేను ఎల్లప్పుడూ ఒక విషయాన్ని నమ్ముతాను. సరైన ఉద్దేశంతో తీసుకున్న తప్పుడు నిర్ణయం ఆమోదయోగ్యమే, కానీ తప్పుడు ఉద్దేశంతో తీసుకున్న తప్పుడు నిర్ణయం ఆ డ్రెస్సింగ్ రూమ్‌‌‌‌‌‌‌‌లో అస్సలు ఆమోదయోగ్యం కాదు’ అని గంభీర్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించాడు.