నేషనల్ హెరాల్డ్ కేసు : విచారణకు హాజరైన టీకాంగ్రెస్ నేతలు

నేషనల్ హెరాల్డ్ కేసు : విచారణకు హాజరైన  టీకాంగ్రెస్ నేతలు

నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా తెలంగాణ  కాంగ్రెస్ లీడర్లు గీతారెడ్డి, గాలి అనిల్కుమార్ లు ఎన్ఫోర్స్మెంట్ ఎదుట హాజరయ్యారు. అధికారులు వీరిద్దరినీ విడివిడిగా ప్రశ్నించారు. గీతా రెడ్డిని మూడు గంటల పాటు, గాలి అనిల్కుమార్ ను ఐదు గంటలపాటు విచారించారు. యంగ్ ఇండియా లిమిటెడ్ విరాళాలకు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీశారు.

విరాళాలకు సంబంధించి ఈడీ నోటీసుల నేపథ్యంలో విచారణకు హాజరైనట్లు గీతా రెడ్డి చెప్పారు. ఈ రోజుతోనే తన విచారణ ముగిసిందని, మళ్లీ రావాలని అధికారులు పిలవలేదని అన్నారు. అధికారులు విరాళాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగినట్లు గీతారెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించినట్లు గాలి అనిల్ కుమార్ చెప్పారు. పలు పత్రాలపై సంతకాలు తీసుకున్న అధికారులు మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పారని అన్నారు. యంగ్ ఇండియా కంపెనీకి తాను రూ. 20 లక్షలు విరాళం ఇచ్చినట్లు అనిల్ కూమార్ తెలిపారు. 

యంగ్ ఇండియాకు విరాళాలకు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తం ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లుకు నోటీసులు పంపింది. అందులో గీతారెడ్డి, షబ్బీర్ అలీ, గాలి అనిల్ కుమార్, అంజన్ కూమార్ యాదవ్, సుదర్శన్ రెడ్డిలు ఉన్నారు. ఈ నెల 3న మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఈడీ విచారణకు హాజరుకాగా.. తాజాగా గీతారెడ్డి, అనిల్ కుమార్ ను అధికారులు ప్రశ్నించారు. కాగా ఇప్పటికే ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు దాదాపు 50 గంటలకుపైగా ప్రశ్నించారు.