అక్టోబర్ 15 నాటికి వైటీపీఎస్‌‌‌‌ 5వ యూనిట్ సింక్రనైజ్

అక్టోబర్  15 నాటికి వైటీపీఎస్‌‌‌‌ 5వ యూనిట్ సింక్రనైజ్
  •     నెలాఖరులో ప్రారంభించేలా పనులు స్పీడప్ చేయండి
  •     బీహెచ్‌‌‌‌ఈఎల్‌‌‌‌ అధికారులకు జెన్‌‌‌‌కో సీఎండీ హరీశ్‌‌‌‌ ఆదేశం
  •     నైని మైన్ నుంచి రోజూ 4 రేకుల బొగ్గు సరఫరాకు ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) 5వ యూనిట్‌‌‌‌ను ఈ నెల 15లోపు పూర్తి సింక్రనైజేషన్ చేయాలని బీహెచ్‌‌‌‌ఈఎల్‌‌‌‌ అధికారులను జెన్‌‌‌‌కో సీఎండీ హరీశ్‌‌‌‌ ఆదేశించారు. ఈ నెల చివరి వారంలో ఈ యూనిట్‌‌‌‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, అందుకు తగ్గట్టుగా మిగిలిన పనులను పరుగులు పెట్టించాలని స్పష్టం చేశారు.

శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా వీర్లపాలెంలోని ప్లాంట్‌‌‌‌ను హరీశ్‌‌‌‌ సందర్శించారు. 5వ యూనిట్ పనుల పురోగతిపై బీహెచ్‌‌‌‌ఈఎల్, జెన్‌‌‌‌కో ఇంజినీర్లతో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ప్లాంట్‌‌‌‌కు ఇంధన కొరత లేకుండా చూసేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్టు సీఎండీ వెల్లడించారు. బొగ్గు సరఫరా మరింత సమర్థవంతంగా సాగేందుకు సింగరేణి నైని కోల్ మైన్ నుంచి రోజుకు నాలుగు రేకుల బొగ్గు తెప్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు. నాణ్యమైన బొగ్గు కోసం మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి కూడా సేకరణ ప్రారంభించినట్టు తెలిపారు.

డిమాండ్‌‌‌‌ను తట్టుకొని విద్యుత్‌‌‌‌ సరఫరా..

రాష్ట్రంలో పెరుగుతున్న భారీ విద్యుత్ డిమాండ్‌‌‌‌ను తట్టుకుని నిరంతర సరఫరా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని హరీశ్‌‌‌‌ పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1 నుంచి 4 యూనిట్లను పూర్తి సామర్థ్యంతో నడుపుతున్నామని, వీలైనంత త్వరగా 5వ యూనిట్‌‌‌‌ను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. పర్యటనలో భాగంగా యాష్ హ్యాండ్లింగ్, కోల్ హ్యాండ్లింగ్, బాయిలర్, టర్బైన్ విభాగాల పనితీరును ఇంజినీర్లతో కలిసి ఆయన సమీక్షించారు.