గ్రేటర్ హైదరాబాద్ బడ్జెట్ రూ.11,460 కోట్లు... విలీనమైన 27 లోకల్ బాడీలను కలుపుకొని కేటాయింపులు

గ్రేటర్ హైదరాబాద్ బడ్జెట్ రూ.11,460 కోట్లు... విలీనమైన 27 లోకల్ బాడీలను కలుపుకొని కేటాయింపులు
  •     పాత జీహెచ్ఎంసీకి రూ.9,200 కోట్లు
  •     కొత్త మున్సిపాలిటీలకు రూ.2,260 కోట్లు
  •     ఆమోదించిన జీహెచ్ఎంసీ కౌన్సిల్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: విలీన ప్రాంతాలతో కలుపుకొని 2026 –27 ఆర్థిక సంవత్సరానికి రూ.11,460 కోట్ల బడ్జెట్ కు జీహెచ్ఎంసీ కౌన్సిల్  ఆమోదం తెలిపింది. ఇందులో పాత జీహెచ్ఎంసీ పరిధిలో రూ.9,200 కోట్లు, కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీల్లో రూ.2,260 కోట్లు కేటాయించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్​లోని కౌన్సిల్  హాల్ లో మేయర్  గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన శనివారం ప్రత్యేకంగా కౌన్సిల్  సమావేశం జరిగింది. ఉదయం 11: 25 గంటలకు  ప్రారంభమైన సమావేశంలో ముందుగా మేయర్  భావోద్వేగ ప్రసంగం చేశారు.  

తర్వాత కమిషనర్  ఆర్వీ కర్ణన్​ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరం రూ.10,714.73 కోట్ల బడ్జెట్​తో పోలిస్తే ఈసారి రూ.745.27 కోట్లు పెంచి బడ్జెట్ రూపొందించారు. రెవెన్యూ ఆదాయం రూ.6,441 కోట్లు, వ్యయం రూ.4,057 కోట్లుగా పేర్కొన్నారు. భవన నిర్మాణ అనుమతులు, ప్రాపర్టీ ట్యాక్స్  కలెక్షన్, ట్రేడ్  లైసెన్స్ చార్జీలతో పాటు ప్రధాన ఆర్థిక వనరుల నుంచి ఆదాయం సమకూరుతున్నందున ఈసారి రెవెన్యూ ఆదాయాన్ని రూ.6,441 కోట్లుగా పొందుపరిచారు. 

కానీ గత ఆర్థిక సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్  రూ.2,038 కోట్లు వసూలు కాగా, రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్  కలెక్షన్  ఆదాయాన్ని తక్కువగా కేటాయించడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తగినట్టుగానే రెవెన్యూ వ్యయాన్ని కూడా రూ. 4,057 కోట్లుగా పేర్కొన్నారు.​ బడ్జెట్ తయారీలో అనేక సవాళ్లు ఎదురయ్యాయని కమిషనర్ తెలిపారు. 27 లోకల్ బాడీలు జీహెచ్ఎంసీలో విలీనం తర్వాత వాటి లయబిలిటీ, అస్సెట్ ను లెక్కించామని చెప్పారు. 

హైదరాబాద్​పై ప్రేమ, నిబద్ధత ఎప్పటికీ తగ్గదు: మేయర్ 

ఐదేండ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్య వ్యవస్థ బలోపేతానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని మేయర్  గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఫిబ్రవరి 10న కౌన్సిల్  పదవీకాలం ముగియనుండడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తనకు సపోర్టు చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పదవీకాలం ముగిసినా హైదరాబాద్ పై ప్రేమ, బాధ్యత, నిబద్ధత ఎప్పటికీ తగ్గదన్నారు. గత ఐదేండ్ల కాలంలో ఘన వ్యర్థాల నిర్వహణ, రోడ్ల అభివృద్ధి, జంక్షన్ల అభివృద్ధి, పౌర సేవల డిజిటలైజేషన్, ప్రజారోగ్య కార్యక్రమాలు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. 

డిప్యూటీ మేయర్  పదవీ తనకు ఎంతో సంతృప్తి మిగిల్చిందని డిప్యూటీ మేయర్  శ్రీలత రెడ్డి అన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలు, సహకరించిన కమిషనర్లు, అధికారులు, సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా.. చంపాపేట డివిజన్  కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వంగా మధుసూదన్ రెడ్డి అకాల మరణంపై కౌన్సిల్  సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని మేయర్ ప్రవేశపెట్టారు. 

బడ్జెట్ వివరాలు రూ. కోట్లలో...


హెడ్ ఆఫ్ అకౌంట్    2025-26 అంచనాలు    2025‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌26 సవరించిన బడ్జెట్      2026-27 అంచనాలు
రెవెన్యూ ఆదాయం         5694.44                             5728.00                                        6441.00
రెవెన్యూ వ్యయం            4799.56                             3785.60                                         4057.00
రెవెన్యూ మిగులు            894.88                               1942.40                                         2382.00
పెట్టుబడుల స్వీకరణ    5020.53                             5182.00                                         5019.00

పెట్టుబడుల స్వీకరణ
( రెవెన్యూ 
మిగులుతో కలిపి)           5915.41                              7124.00                                        7403.00
పెట్టుబడుల వ్యయం    5915.17                               7224.40                                       7403.00
బడ్జెట్ సైజు                   10,714,73                            11,010.00                                    11,460.00