- మూడు చోట్ల కేంద్రాలు ఏర్పాటు
- ఏ రోజుకు ఆరోజే క్లియర్ చేసేందుకు కసరత్తు
- 10 రోజుల్లో ప్రత్యేక కౌన్సిల్ మీటింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: వార్డుల డీలిమిటేషన్ పై బుధవారం నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ ప్రక్రియ వారం పాటు కొనసాగనున్నది. విలీనం తర్వాత వార్డుల సంఖ్య 300కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వార్డుల పునర్విభజనకి సంబంధించిన ప్రాసెస్‌ను జీహెచ్ఎంసీ స్పీడప్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి అభ్యంతరాలను, సలహాలను స్వీకరించడానికి సర్కిల్ ఆఫీసులు, జోనల్ ఆఫీసులు, హెడ్డాఫీసులో స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
విలీనం తర్వాత కొత్తగా ఏర్పడిన సర్కిల్ ఆఫీసు(ఇదివరకు ఉన్న మున్సిపల్ ఆఫీసు)ల్లోనూ స్వీకరించనున్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని, సలహాను ఆలస్యం చేయకుండా, ఏ రోజుకు ఆరోజే క్లియర్ చేసేందుకు ప్లాన్చేశారు. అభ్యంతరాలు, సలహాలపై మరింత లోతుగా చర్చించడానికి, పరిశీలించడానికి 10 రోజుల్లో ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం మేయర్ తో చర్చలు జరపనున్నారు. కౌన్సిల్ ఆమోదం తీసుకొని ముందుకెళ్లనున్నారు.
పక్కాగా వార్డుల పునర్విభజన...
వార్డుల పునర్విభజనకి సంబంధించిన ప్రక్రియని జీహెచ్ఎంసీ స్పీడ్ గా చేసినప్పటికి అధికారులు పక్కాగా జాగ్రత్తలు తీసుకున్నారు. 300 వార్డులు ఏర్పాటు చేయగా, ఇదివరకు ఉన్న 6 జోన్లని10 జోన్లకి పెంచి విభజించారు. అలాగే ఒక్కో జోన్ కి 30 వార్డులు రావడంతో పాటు ఒక వార్డు పరిధి మరో సర్కిల్, మరో నియోజకవర్గంలోకి రాకుండా చూసుకున్నారు. సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఎంసీహెచ్ఆర్డీలో 10 రోజుల పాటు కూర్చొని డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పుడు చివరి ఘట్టమైన అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు.
మే లేదా జూన్‌లో ఎన్నికలు?
విలీనానికి సంబంధించిన హడావిడి చూస్తుంటే వెంటనే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత అధికార పార్టీ జోష్ లో ఉంది. ఇదే ఊపులో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రస్తుతం విలీనమైన ప్రాంతాల్లో ఇతర పార్టీల క్యాడర్చాలా వరకు అధికార పార్టీలోకి చేరారు. ఇది కూడా తమకు కలిసొస్తుందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన వెంటనే గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. వార్డు పునర్విభజన పూర్తికాగానే రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు వెళ్లే అవకాశం ఉంది. అంతా అనుకూలకంగా ఉంటే వచ్చే ఏడాది మే లేదా జూన్ లో గ్రేటర్ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.

