జీహెచ్‌‌‌‌ఎంసీ విభాగాలపై పూర్తి అవగాహనతో ఉండాలి

జీహెచ్‌‌‌‌ఎంసీ విభాగాలపై పూర్తి అవగాహనతో ఉండాలి
  • కొత్త ఆఫీస్లరతో కమిషనర్​ భేటీ
  • బల్దియా విస్తరణ తర్వాత ఇదే మొదటి సమావేశం
  • అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు అవగాహన కార్యక్రమం 

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ విభాగాల పనితీరు, విధులపై కొత్తగా బాధ్యతలు చేపట్టిన అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. ఇటీవల జీహెచ్‌‌‌‌ఎంసీని 6 జోన్ల నుంచి 12 జోన్లకు, 30 సర్కిళ్ల నుంచి 60 సర్కిళ్లుగా పునర్ వ్యవస్థీకరించిన నేపథ్యంలో కొత్త అధికారులకు జీహెచ్‌‌‌‌ఎంసీ హెడ్ ఆఫీస్​లో వివిధ విభాగాల పనితీరుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  

జీహెచ్ఎంసీ విస్తరణ తర్వాత ఇదే తొలి సమావేశం కావడం విశేషం. ఇందులో ఇంజినీరింగ్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ అండ్ శానిటేషన్, రెవెన్యూ అండ్ ప్లానింగ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ సపోర్ట్, అర్బన్ సర్వీసెస్ అండ్ డెవలప్​మెంట్ విభాగాల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా ఆయా విభాగాల విధులు, బాధ్యతలు, పనితీరు అంశాలను అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు వివరించారు. అధికారులు అడిగిన సందేహాలకు సంబంధిత విభాగాధికారులు సమాధానాలు ఇచ్చారు. 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. విభాగాల పనితీరుపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కొత్త అధికారులు తమ బాధ్యతలను స్పష్టతతో, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ నెల 6న ఇంజినీరింగ్ ప్రాజెక్టులు, 7న శానిటేషన్, 8న టౌన్ ప్లానింగ్, 9న మెయింటెనెన్స్ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జోన్ల వారీగా జీహెచ్‌‌‌‌ఎంసీ వివిధ విభాగాల పనితీరు, కోర్ విధులపై సమగ్రంగా వివరించేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు సిద్ధం చేయాలని విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. 

ఈ అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని జీహెచ్‌‌‌‌ఎంసీ పనితీరుపై సమగ్ర అవగాహన పొందడంతో పాటు సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కమిషనర్లు సృజన, వినయ్ కృష్ణారెడ్డి, హేమంత్ కేశవ్ పాటిల్, రఘు ప్రసాద్, పంకజ్, మంగ తాయారు, సత్యనారాయణ, జోనల్ కమిషనర్లు జి. ముకుందరెడ్డి, అపూర్వ్ చౌహాన్, కె. చంద్రకళ, రాధికా గుప్తా, రవి కిరణ్, ప్రియాంక అలా, సంచిత్ గంగ్వార్, హేమంత్ బోర్కడే, సహదేవ్ రావు, చీఫ్ ఇంజినీర్లు సహదేవ్ రత్నాకర్, జ్యోతి తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.