మాన్సూన్​కు సిద్ధంగా ఉందాం..పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులతో కమిషనర్ కర్ణన్ సమీక్ష

మాన్సూన్​కు  సిద్ధంగా ఉందాం..పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులతో కమిషనర్ కర్ణన్ సమీక్ష

హైదరాబాద్ సిటీ, వెలుగు:  వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో సిద్ధంగా ఉందామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్​లో మాన్సూన్ కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై ట్రాఫిక్ డీసీపీ జోయల్, జోనల్ కమిషనర్లుహేమంత్ కేశవ్ పాటిల్, అనురాగ్ జయంతి, వెంకన్న, రవికిరణ్, అపూర్వ్ చౌహాన్, హేమంత్ సహదేవ్ రావు, సీఈ రత్నకార్ తదితరులతో కలిసి సమావేశం నిర్వహించారు. 

డీ-సిల్టింగ్ పనుల పురోగతి, వాటర్ లాగిన్ పాయింట్లు తదితర వాటిపై చర్చించి పలు సూచనలు చేశారు. జోన్ వారిగా సమస్యల పరిష్కారాలపై సమీక్షించారు. నగరంలోని ప్రధాన నాలాలు, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ లను వేగవంతంగా క్లీన్ చేయాలని ఆదేశించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ను అవసరం మేరకు ఏర్పాటు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ శాఖల మధ్య సమన్వయం ఉండేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మరింత బలోపేతం చేయాలన్నారు. 

స్ట్రీట్ లైట్ల నిర్వహణ స్వయంగా నిర్వహిస్తున్నం..

స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించి ఈఈఎస్ఎల్ అగ్రిమెంట్ ముగియడంతో ఈ నెల 1 నుంచి జీహెచ్ఎంసీ స్వయంగా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. జోన్ వారిగా స్ట్రీట్ లైట్లకి సంబంధించి సామాగ్రి కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సమస్యలను  వెంటనే  పరిష్కారం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల్లో 70 శాతం పరిష్కరించినట్లు తెలిపారు. జోనల్ కమిషనర్, మెయింటెనెన్స్ డిపార్ట్​మెంట్ ఇంజినీరింగ్ అధికారులు కూడా  తరచూ పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

సిగ్నల్స్ వద్ద బ్యాకప్ బ్యాటరీలు ఏర్పాటు చేయాలి

కరెంట్ సరఫరా నిలిచిపోయిన సమయంలో సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్​సమస్య ఎక్కువ అవుతుందని ట్రాఫిక్ అడిషనల్ సీపీ జోయల్ అన్నారు. దీంతో ఆయా సిగ్నల్‌ వద్ద  ఒక ట్రాఫిక్ పోలీస్ స్థానంలో ముగ్గురిని పెట్టిన కూడా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. సిగ్నల్స్ వద్ద బ్యాకప్ బ్యాటరీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. అలాగే వెదర్ అలర్ట్ సకాలంలో ఇవ్వాలని పేర్కొన్నారు. రోడ్డు తవ్వకాలు చేసి విడిచి పెట్టకుండా, వెంటనే రోడ్డు వేయాలని,  లేదంటే వర్షాలు పడిన సమయంలో ఆ గుంతలతో  ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయన్నారు. 

చెట్లు పడిపోవడం వల్ల కూడా ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని, ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాంతంలో ముందస్తుగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురిసిన సమయంలో  బ్రేక్ డౌన్ అయిన వాహనాలతో  కూడా సమస్య వస్తుందని, అందుకు జీహెచ్ఎంసీ పెద్ద క్రేన్ ఏర్పాటు చేయాలని కోరారు.