ఆ 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రికార్డ్స్ స్వాధీనం చేసుకోండి..వెంటనే వాటికి జీహెచ్ఎంసీ బోర్డులు పెట్టండి

ఆ  27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రికార్డ్స్ స్వాధీనం చేసుకోండి..వెంటనే వాటికి జీహెచ్ఎంసీ బోర్డులు పెట్టండి

జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం వేగవంతం అయ్యింది.  ఇప్పటికే ప్రభుత్వం పంపిన ఆర్డినెన్సు కు గవర్నర్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ  ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీకర్ణన్ .27 మున్సిపాలిటీల్లో రికార్డ్స్ స్వాధీనం చేసుకోవాలని  డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేశారు.  జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో డిప్యూటీ  మున్సిపల్ కమిషనర్లు రికార్డ్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రత్యేకంగా రికార్డ్స్ ప్రొఫార్మ రూపొందించాలని ఆదేశించారు. 

 27 మున్సిపాలిటీల్లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్ల  బాధ్యతల జాబితా విడుదల చేస్తూ జీహెచ్ ఎంసీ కమిషనర్  ఉత్తర్వులు జారీ చేశారు.27 మున్సిపాలిటీల సిబ్బంది వివరాలు ఇవ్వాలని CDMA ను GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్కోరారు.  జీహెచ్ఎంసీలో  విలీనమయ్యే 27 మున్సిపాలిటీలలో ఉన్న సిబ్బంది వివరాలను తక్షణమే అందించాలని కోరారు.  సాంక్షన్‌డ్ స్ట్రెంత్, వర్కింగ్ స్ట్రెంత్, రెగ్యులర్ ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్ సిబ్బంది పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా కమిషనర్ లేఖ రాశారు. జీహెచ్ఎంసీలో   మున్సిపాలిటీల ప్రక్రియ వేగవంతం చేసేందుకు అత్యవసరంగా ఈ డేటాను కోరినట్లు లేఖలో స్పష్టం చేశారు.  

జీహెచ్ఎంసీలో విలీనమయ్యే మున్సిపాలిటీల మినిట్స్ బుక్స్‌ ను నిలిపివేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.  సంబంధిత మున్సిపాలిటీల బ్యాంక్ ఖాతాలను మూసివేసి, వాటిలోని నిధులను GHMC ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ ఆఫీస్ లకు జీహెచ్ఎంసీ పేరుతో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.  విలీనం కానున్న మున్సిపాలిటీలకు సంబంధించిన ఉద్యోగుల వివరాలు, ఆస్తులు, డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్లు, పథకాల వివరాలు, వివిధ పనులకు చెల్లించాల్సిన బిల్లుల వివరాలన్నీ ప్రొఫైల్ రూపంలో తయారు చేసి ఇవ్వాలని చెప్పారు.  గత 3 ఏళ్లలో ఇచ్చిన బిల్డింగ్, లేఅవుట్ అనుమతుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఆయా వివరాలన్నింటితో డిసెంబర్ 5 లోగా రిపోర్ట్ సబ్మిట్ చేయాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్. 

జీహెచ్​ఎంసీలో విలీనమయ్యే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇవే..!

పెద్ద అంబర్‌‌పేట్ , జల్​పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నర్సింగి, ఆదిబాట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట, కొంపల్లి, దుండిగల్, బోలారం, తెల్లాపూర్, అమీన్​పూర్, బడంగ్‌‌పేట్, బండ్లగూడ జగీర్, మీర్‌‌పేట్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌‌నగర్, నిజాంపేట్.