
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్లో విధులకు హాజరుకాని బూత్ లెవల్ ఆఫీసర్ల(బీఎల్ఓల)పై వేటు వేసేందుకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వారికి మంగళవారం డెడ్ లైన్ విధించారు. సాయంత్రం లోపు హాజరుకాకపోతే సస్పెండ్ చేయనున్నట్లు తెలిసింది.
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 3,984 మందికి బీఎల్ఓ విధులు అప్పగించగా.. 746 మంది గైర్హాజరయ్యారు. ఇందులో కమర్షియల్ ట్యాక్స్, జీహెచ్ఎంసీ, సివిల్ సప్లై, హెల్త్ తదితర విభాగాలకు చెందిన వారు ఉన్నారు. 40 రోజులుగా పోలింగ్ కేంద్రాల్లో కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల దరఖాస్తుల స్వీకరణ, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల ఏర్పాట్ల పరిశీలన వంటి విధులు నిర్వహిస్తున్నారు. ఎంతో కీలకమైన ఈ విధులకు హాజరుకాకపోవడంపై కర్ణన్ సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఒక్కరోజు చూసి, హాజరుకాని వారందరిపై వేటు వేయనున్నట్లు సమాచారం.