GHMC కాంట్రాక్టర్ల మీటింగ్ రచ్చరచ్చ

GHMC కాంట్రాక్టర్ల మీటింగ్ రచ్చరచ్చ

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్​లోని కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆఫీసు వద్ద సోమవారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్ ఉద్రిక్తతకు దారితీసింది. కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి ఏర్పడిన సమావేశం అంతర్గత పోరాటానికి వేదికై రసాభాసంగా ముగిసింది. అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి పదవీకాలం ముగిసి 7 నెలలైనప్పటికీ.. ఆయన పదవిలో కొనసాగడంపై పలువురు కాంట్రాక్టర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటమాట పెరిగి బూతుల తిట్టుకునే స్థాయి వరకూ వెళ్లింది. ఈ గందరగోళం మధ్య ప్రస్తుత అధ్యక్షుడు తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు. అధ్యక్షుడిగా నేనే కొనసాగుతా, ఎవరు ఏమి చేస్తారో చేసుకోండని బెదిరించారు. 

ఈ క్రమంలో కుర్చీలను ధ్వంసం చేశారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారిని సముదాయించారు. చివరికి అధ్యక్షుడు రాజీనామా చేయాలని, త్వరలో ఎన్నికలు నిర్వహించాలని జనరల్ బాడీ నిర్ణయించింది.