పార్టీ మారనున్న కార్పొరేటర్లు.. త్వరలో కాంగ్రెస్లోకి 12 మంది

 పార్టీ మారనున్న కార్పొరేటర్లు.. త్వరలో  కాంగ్రెస్లోకి 12 మంది
  • బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరేందుకు కార్పొరేటర్లు రెడీ
  •     ఇటీవల కూర్చుని మాట్లాడుకున్న నేతలు
  •     పార్టీ మారే అంశంపై కాంగ్రెస్​నేతలతోనూ చర్చలు
  •     త్వరలో  చేరనున్నట్లు సమాచారం 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు జెండా మారుస్తున్నారు. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ సహా చాలా మంది కాంగ్రెస్​లో​ చేరగా, మరికొందరు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. రోజురోజుకు బీఆర్ఎస్ ​గ్రాఫ్ డౌన్ అవుతుండడంతో ఆ పార్టీలో ఉంటే ప్రయోజనం లేదని, కనీసం తమ డివిజన్లనైనా డెవలప్ చేసుకునేందుకు అధికార కాంగ్రెస్​లో చేరనున్నట్లు వారి సన్నిహితుల వద్ద చెబుతున్నారు. మరోవైపు గ్రేటర్​లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్​అధిష్ఠానం ప్లాన్ చేస్తుంది. వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకునే విధంగా ఇప్పట్నుంచే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. 

త్వరలో 12 మంది చేరిక 

నాలుగు రోజుల క్రితం బీజేపీ, బీఆర్​ఎస్​కు చెందిన15 మంది కార్పొరేటర్లు ఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్​కు చెందిన పలువురు 
కార్పొరేటర్లను ఆహ్వానించి చేరికకు సంబంధించి చర్చించినట్లు తెలిసింది. ఇందులో దాదాపు 12 మంది కార్పొరేటర్లు పార్టీలు మారుతారనే ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎక్కువ శాతం బీఆర్ఎస్​ నుంచి, బీజేపీకి చెందిన ఇద్దరు, ముగ్గురు ఉన్నట్లు సమాచారం.  

ఇప్పటికే 19కి చేరిన కాంగ్రెస్ సంఖ్య

2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్​ నుంచి 56 మంది, బీజేపీ నుంచి 48, ఎంఐఎం నుంచి 44,  కాంగ్రెస్​ నుంచి ఇద్దరు కార్పొరేటర్లుగా గెలుపొందారు. ప్రమాణ స్వీకారానికి ముందే ఇందులో బీజేపీ నుంచి గెలుపొందిన లింగోజీగూడ కార్పొరేటర్ మరణించాడు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్​ గెలిచింది. ఆపై ఎంఐఎం కార్పొరేటర్లు మినహా మిగతా వారు అటు ఇటు పార్టీలు  మారుతూ వచ్చారు. ఎంఐఎం నుంచి ఇద్దరు కార్పొరేటర్లు  అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందగా, ఎర్రగడ్డ కార్పొరేటర్ మరణించారు. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్​కు 47 మంది, ఎంఐఎంకు 41, బీజేపీకి మంది, కాంగ్రెస్​కు 19 మంది కార్పొరేటర్లు ఉన్నారు.