
- పార్కు చుట్టూ వెలసిన ఫుడ్‌కోర్టు, కాఫీ షాప్, రెస్టారెంట్
- తొలగించిన బల్దియా
హైదరాబాద్ సిటీ, వెలుగు: కేబీఆర్ పార్క్ చుట్టూ ఏర్పాటు చేసిన ఆక్రమణలను జీహెచ్ఎంసీ మంగళవారం తొలగించింది. గేట్ నంబర్–3 వద్ద అక్రమంగా నిర్మించిన ఫుడ్ కోర్టును పూర్తిగా తొలగించారు. ఎలాంటి ట్యాక్స్‌లు కట్టకుండా గేట్ నంబర్–2 వద్ద ఉన్న ఏర్పాటు చేసిన ‘కాసా డీ లట్టే’, గేట్ నంబర్–3 వద్ద చిచ్చాస్ రెస్టారెంట్లను సీజ్ చేశారు. అక్రమ నిర్మాణాలతో పాటు ట్యాక్స్ లు చెల్లించకుండా వ్యాపారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య హెచ్చరించారు.
ఫిలింనగర్లో కమిషనర్పర్యటన
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ జోనల్ కమిషనర్ తో కలిసి ఫిలింనగర్ లో పర్యటించారు. రోడ్ నెం.13 వద్ద ఆలయ ఎగ్జిట్ గేట్ సమీపంలో అక్రమంగా జనరేటర్, వాచ్‌మన్ షెడ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దీనివల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుండటంతో కమిషనర్ఆదేశాల మేరకు తొలగించారు. అపోలో హాస్పిటల్ జంక్షన్ నుంచి రోడ్ నెం.86 వరకు 12–15మీటర్లున్న రోడ్డును 18మీటర్లకు, రోడ్ నంబర్3 నుంచి ఫిలింనగర్ వెళ్లే రోడ్డును18మీటర్ల నుంచి 24మీటర్లకి విస్తరించాలని ఆదేశించారు. మార్కింగ్ పనులు 3 రోజుల్లో పూర్తి చేయాలన్నారు.
చెరువు పరిధిలో ప్రహరీ కూల్చివేత
అబ్దుల్లాపూర్ మెట్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామ పరిధిలో ఓ అక్రమ నిర్మాణాన్ని ఇరిగేషన్ అధికారులు కూల్చేశారు. సర్వే నంబర్ 141లో గల పిట్టల చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో రెండెకరాల స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు కాంపౌండ్ వాల్ నిర్మించారు. మంగళవారం ఇరిగేషన్ అధికారులు అక్కడికి చేరుకొని వాల్ ను కూల్చేశారు. ఇరిగేషన్ అధికారి వంశీ మాట్లాడుతూ.. చెరువుల దగ్గరలో ఎవరైనా ప్లాట్లు కొనాలనుకుంటే హెచ్ఎండీఏ లేక్స్ వెబ్ సైట్ లో పూర్తి డేటా పరిశీలించాలని సూచించారు. సందేహాలు ఉంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను సంప్రదించాలన్నారు.