- ఈ ఒక్క నెలలోనే ఇద్దరి పట్టివేత
- టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగంలోనే ఎక్కువ అవినీతి
- ఏండ్లుగా ఒకే చోట పాతుకుపోవడమూ కారణం
- ఈ మధ్యే టౌన్ ప్లానింగ్‌లో భారీగా బదిలీలు
- ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లోనూ ప్రక్షాళనకు కమిషనర్చర్యలు
హైదరాబాద్ సిటీ, వెలుగు:బల్దియాలో అవినీతి కామనైపోయింది. ఏ ఫైల్ ముందుకు కదిలించాలన్నా ఇక్కడ మామూళ్లు మామూలైపోయాయి. ఏ విభాగంలో చూసినా ఇదే పరిస్థితి. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్విభాగాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో భవన నిర్మాణ అనుమతులివ్వడానికి, నిర్మాణం పూర్తయ్యాక ఇచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల(ఓసీ)కు భారీగానే డిమాండ్చేస్తున్నారు. కాసులిస్తే ఫీల్డ్ విజిట్ చేయకుండానే నిర్మాణ అనుమతులిస్తున్నారు.
ఇంజినీరింగ్వింగ్లో ఆఫీసర్లు వేయని రోడ్లకు సైతం బిల్లులు ఇచ్చేస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా సక్రమంగా ఉన్న పనులకు బిల్లులు విడుదల చేయడానికి, పర్మిషన్లు ఇవ్వడానికి బిల్డర్లు, కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారం పెరిగిపోవడంతో సహనం నశించిన బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు వల వేసి పట్టుకుంటున్నారు. ఇలా ఐదు నెలల్లో ఐదుగురు బల్దియా అధికారులు ఏసీబీకి చిక్కారు. ఇందులో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పన్ను సవరణ పేరుతో బిల్కలెక్టర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంసీలు ఉండడం గమనార్హం..
ఈ నెలలోనే ఇద్దరు మహిళా ఆఫీసర్లు..
కేవలం ఈ ఒక్క జూన్నెలలోనే లంచం తీసుకుంటూ ముగ్గురు బల్దియా అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇందులో ఇద్దరు మహిళా ఆఫీసర్లు ఉండడం గమనార్హం. కాప్రా సర్కిల్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్న స్వరూప చర్లపల్లికి చెందిన ఓ కాంట్రాక్టర్ పూర్తి చేసిన పనిని మెజెర్మెంట్ బుక్ లో ఎంట్రీ చేసేందుకు రూ. లక్షా 20 వేలు డిమాండ్చేసింది. ఆ డబ్బులు తీసుకుంటుండగా, ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అంబర్ పేట సర్కిల్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా పని చేస్తున్న మనీషా..కాంట్రాక్టర్ బిల్లును పై ఆఫీసర్‌కు పంపడం కోసం రూ.20 వేలు డిమాండ్చేసింది.
సదరు కాంట్రాక్టర్ రూ.5 వేలు అడ్వాన్స్ ఇచ్చి, మిగతా రూ.15 వేలు ఇస్తూ ఏసీబీ అధికారులకి రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు. ఈ ఇద్దరు ఆరు రోజుల వ్యవధిలోనే ట్రాప్అయ్యారు. అలాగే, మే 3న ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దశరథ్ ఫైల్ లో సంతకం చేయడానికి ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు. గత నెల 23న సికింద్రాబాద్ కు చెందిన అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ విఠల్ రావు ఓ పర్మిషన్ విషయంలో రూ.8 లక్షలకు ఒప్పందం చేసుకుని, రూ.4 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డాడు.
భారీగా బదిలీలు..
బల్దియాలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ వింగ్‌లో ఆఫీసర్లు, సిబ్బందిపై ఎప్పుడూ అవినీతి ఆరోపణలు వస్తుంటాయి. వీరిలో చాలామంది ఎక్కువ రోజులు ఒకేచోట పని చేయడం వల్ల కూడా అవినీతి పెరిగిపోతోందని కమిషనర్కర్ణన్గుర్తించారు. దీనికి చెక్‌పెట్టడానికి టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఐదు రోజుల కింద 13మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్ల(ఏసీపీ)ను, ఇదే విభాగంలోని కీలకంగా వ్యవహరిస్తున్న 14 మంది సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేశారు. అయితే, ఇంజినీరింగ్అధికారుల వ్యవహారం ఆయనకు తలనొప్పిగా పరిణమించిది.
‘ఇంజినీరింగ్’ అవినీతికి చెక్ పెట్టేందుకు ...
బల్దియాలో టౌన్ ప్లానింగ్ తర్వాత ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఇంజినీరింగ్ అధికారులపైనే వస్తున్నాయి. దీంతో ఈ విభాగంలో మార్పులు చేయాలని కమిషనర్ కర్ణన్నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు పనులు చేసిన తర్వాత మెజెర్మెంట్ చేయడంతో పాటు బిల్లులు ఇచ్చే అధికారం ఇంజినీరింగ్ఆఫీసర్లకే ఉంది. అయితే, బిల్లులు ఫైనల్ చేసే విషయంలో డిప్యూటీ కమిషనర్లను ఇన్వాల్చేయాలని కమిషనర్ భావిస్తున్నారు. ముందు ఇంజినీరింగ్అధికారులు, ఆ తర్వాత డీసీలు ఫైనల్ చేసిన తర్వాతే బిల్లులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం.
