V6 News

కొందరికి ఇష్టం.. మరికొందరికి కష్టం.. జీహెచ్ఎంసీలో 150 నుంచి 243కు పెరిగిన వార్డుల సంఖ్య

కొందరికి ఇష్టం.. మరికొందరికి కష్టం.. జీహెచ్ఎంసీలో 150 నుంచి 243కు పెరిగిన వార్డుల సంఖ్య
  • ఇది వరకు 150 మంది.. ఇకపై మరో 100 మందికి అవకాశం 
  •  శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య 57 మాత్రమే
  • సంఖ్య తగ్గడంతో అక్కడి లీడర్ల అసంతృప్తి

హైదరాబాద్ సిటీ, వెలుగు: లోకల్ బాడీలు జీహెచ్ఎంసీ విలీనం తరువాత జరుగుతున్న వార్డుల పునర్విభజనపై కొందరు సంతృప్తి వ్యక్తం  చేస్తుండగా, ఇంకొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల సంఖ్యను పెంచడం కొందరిలో సంతోషాన్ని నింపగా, శివారు ప్రాంతాల విలీనం కారణంగా మరికొందరిలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. జీహెచ్ఎంసీలో ఇదివరకు 150 వార్డులుండగా, ఇప్పుడు ఈ లిమిట్ లో వార్డుల సంఖ్య ఏకంగా 243కి పెరిగింది. అయితే, శివారులోని 20 మున్సిపాలిటీల్లో 20 మంది చైర్ పర్సన్లు, 20 మంది వైస్ చైర్ పర్సన్లు ఉండేవారు. 

అలాగే, 7 కార్పొరేషన్లలో ఏడుగురు మేయర్లు, ఏడుగురు డిప్యూటీ మేయర్లు ఉండేవారు. వీరిలో పాటు 200 వరకు మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో140 మంది వరకు కార్పొరేటర్లు ఉండేవారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఒక్కసారిగా 57 వార్డులు మాత్రమే జరిగాయి. ఒక్కసారిగా రాజకీయ నేతలకు అవకాశాలు కోల్పోతుండటంతో ఈ ప్రాంతాల వారు వార్డుల పునర్విభజనని వ్యతిరేకిస్తున్నారు. వార్డులు మరిన్ని పెంచాలనే ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు.

పార్టీ పెద్దలకు తలనొప్పి..
గతంలో ఒక్కో మున్సిపాలిటీలో 10 నుంచి 20 మందికి అవకాశం దక్కేది. ఇప్పుడు విలీనమైన తర్వాత ఆ మొత్తం ప్రాంతానికి కలిపి ఇద్దరికి మాత్రమే అవకాశం వస్తుండడంతో డిమాండ్ అమాంతం పెరిగింది. లీడర్లు పదుల సంఖ్యలో ఉండడంతో కేవలం ఒకరిద్దరికి మాత్రమే అవకాశం కల్పించాల్సి వస్తుండడంతో పార్టీల పెద్దలకు కూడా తలనొప్పిగానే మారింది. ఇప్పటికే వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ కోసం ఆశావాహులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

ఒక పార్టీలో టికెట్ లభించకపోతే మరో పార్టీ నుంచి లభిస్తుందేమోనని ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు టికెట్ దక్కించుకోవడానికి ఆశావహులు తమ పార్టీల పెద్దల వద్దకు క్యూ కడుతున్నారు.  కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో టికెట్ల లాబీయింగ్ మొదలైంది. వార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత మరింత డిమాండ్ ఏర్పడే ఛాన్స్ ఉంది.  దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రస్తుత నేతలు, ఆశావహులు వార్డుల విభజనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరాలకు మరో వారం గడువు ఉండడంతో తర్వాత ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటాయేమోనని ఆశతో ఉన్నారు.  

జీహెచ్ఎంసీలో పెరగనున్న 93 మంది కార్పొరేటర్లు 
శివారు ప్రాంతాల నేతలు వార్డుల పునర్విభజనని వ్యతిరేకిస్తుంటే ఇదివరకు ఉన్న బల్దియా పరిధిలో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు సంతోషంగా ఉన్నారు. జీహెచ్ఎంసీలో ఇదివరకు 150 వార్డులు ఉండగా, ఇప్పుడు 243కి చేరాయి.  ఇప్పటి వరకు 150 మంది కార్పొరేటర్లకు మాత్రమే అవకాశం ఉండగా, ఇప్పుడు  మరో100 మందికి ఛాన్స్​రాబోతోంది. ఈ నేపథ్యంలో కూడా విలీనంతో పాటు వార్డుల  పునర్విభజనను వీరు వ్యతిరేకించడంలేదు. 

ఎంఐఎం, బీజేపీ నేతలు మాత్రం విలీనంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓల్డ్ సిటీలో ఇది వరకు 52 వార్డులు ఉండగా అవి 72కి పెరిగాయి. సంఖ్య పెరిగినా, సరిహద్దుల మార్పుతో తమ ఓటు బ్యాంకుకు ముప్పు వాటిల్లుతుందని వీరు గుర్రుగా ఉన్నారు. దీనిపై బుధవారం కమిషనర్​ను కలిసి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులు మూడు ముక్కలు అయ్యాయని, ఇదంతా కావాలనే చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. 

అయ్యో...ఎంత పనై పాయే...
గతంలో నిజాంపేట​కార్పొరేషన్​లో 33 వార్డులకు 33 మంది కార్పొరేటర్లు ఉండేవారు. విలీనం తర్వాత నాలుగు వార్డులు మాత్రమే చేయడంతో అంతా నిరాశలో కూరుకుపోయారు. కొంపల్లిలో  మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 18 మంది కౌన్సిలర్లు ఉండగా, ఇప్పుడు రెండు వార్డులు మాత్రమే చేశారు.

‘డబుల్’ ​బొనాంజా
కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్లలో 8 మంది కార్పొరేటర్లు ఉండగా, ప్రస్తుతం15 డివిజన్లయ్యాయి. దీంతో ఇక్కడి లీడర్లు పండుగ చేసుకుంటున్నారు. ఒకవేళ వార్డు రిజర్వేషన్​మారినా, గతంలో తన డివిజన్​లోని ప్రాంతంలో ఉన్న మరో డివిజన్​లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అలాగే గతంలో టికెట్​రాక నిరాశ చెందిన వారికి  ఇప్పుడు ఎక్కడో చోట టికెట్​ఇచ్చే ఛాన్స్​ ఉంటుంది.