చమురు ధర త్వరలోనే 100 డాలర్లు ? భారత్పై భారం ఎక్కువే

 చమురు ధర త్వరలోనే 100 డాలర్లు ? భారత్పై భారం ఎక్కువే

న్యూఢిల్లీ: యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. అమెరికా వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్  క్రూడ్ ​ధర 3.19 శాతం పెరిగి 67.29 డాలర్లకు చేరగా, బ్రెంట్ క్రూడ్ 72.87 డాలర్లకు చేరుకుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ధర బ్యారెల్ కు 100 డాలర్లను తాకుతుందని బార్​క్లేస్​ బ్యాంక్ అంచనా వేసింది. 

ధర ఈ స్థాయికి చేరితే మనదేశంలో పెట్రోల్, డీజిల్​​ ధర రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ చమురు ధర  120 డాలర్ల దాకా వెళ్లినప్పటికీ ఆ తర్వాత తగ్గింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా ఉన్న హార్ముజ్ జలసంధిపై ఇరాన్​కు పట్టు ఉండటంతో చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళన పెరిగింది. 

దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ పై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది.  ఇంధన ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు కరెంట్ అకౌంట్ లోటు ఎగిసే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ వద్ద 76 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది.  ఓపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని పెంచితే మార్కెట్ పై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. 

మనదేశం రోజుకు 5.5 మిలియన్​ బ్యారెళ్ల చమురును వాడుతుంది. ఇందులో రెండు మిలియన్​బ్యారళ్లు హార్ముజ్​ మీదుగానే వస్తోంది. క్రూడ్​ ధర  ఒక్క డాలర్​ పెరిగినా.. ఏటా ప్రభుత్వంపై రూ.13 వేల కోట్ల భారం పడుతుంది. గత ఏడాది మనదేశం 160 బిలియన్ డాలర్ల విలువైన క్రూడ్​ను కొనుగోలు చేసింది.