న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ప్రస్తుత (2025–-26) ఆర్థిక సంవత్సరానికి 8.25శాతం వడ్డీ ఇవ్వనుంది. వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలో కూడా వడ్డీ రేటును మార్చలేదు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు), ఇతర పెట్టుబడుల నుంచి మంచి ప్రాఫిట్స్ రావడంతో 8 శాతం కంటే ఎక్కువ వడ్డీని ఈసారి కూడా ఇవ్వాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసిన తర్వాత సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుంది. అదనంగా, రూ.వెయ్యి లేదా అంతకంటే తక్కువ అమౌంట్ ఉన్న పనిచేయని ఖాతాలపై ‘ఆటో- క్లెయిమ్ సెటిల్మెంట్’ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. కేంద్రం కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మొదటి దశలో 1.33 లక్షల ఖాతాల్లోని దాదాపు రూ.5.68 కోట్లను సభ్యుల ఆధార్ -లింక్డ్ బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రూ.1,000 కంటే ఎక్కువ నిల్వలున్న ఖాతాలకు కూడా ఈ సౌకర్యాన్ని సంస్థ విస్తరించనుంది.
