- ఒక్కసారిగా సైలెంట్ అయిన అధికారులు
- తొలగించిన చోట తిరిగి యథేచ్ఛగా నిర్మాణాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో పాదచారుల కష్టాలకు చెక్ పెట్టాలని జీహెచ్‌ఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు’ ప్రక్రియ కంటితుడుపు చర్యగా మిగిలిపోయింది. ఈ ఏడాది మార్చి 28న ప్రారంభమైన ఈ స్పెషల్ డ్రైవ్.. మూడు శనివారాలకే పరిమితమై అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నగరవ్యాప్తంగా సుమారు 2,337 ఆక్రమణలను గుర్తించి, తొలగించడంతో పాదచారులకు కొంత ఊరట లభించింది.
అయితే, పాతబస్తీ ప్రాంతంలో రాజకీయ నాయకుల జోక్యం, స్థానిక ఒత్తిళ్లు మొదలవ్వడంతో పరిస్థితి మారిపోయింది. డ్రైవ్ ప్రారంభంలో కనిపించిన ఉత్సాహం క్రమంగా నీరుగారి, మూడో వారం తర్వాత పూర్తిగా ఆగిపోయింది. అధికారులు కూల్చివేసిన ప్రాంతాల్లోనే మళ్లీ అదే స్థాయిలో ఆక్రమణలు వెలిశాయి. వ్యాపారులు, భవన యజమానులు తిరిగి యథేచ్ఛగా తాత్కాలిక నిర్మాణాలను ఏర్పాటు చేసుకున్నారు.
సెన్సస్ సాకుతో బ్రేక్
దీనిపై అధికారులను వివరణ కోరగా.. ప్రస్తుతం సిబ్బంది జనాభా లెక్కల (సెన్సస్) విధుల్లో నిమగ్నమై ఉన్నారని, అందుకే డ్రైవ్‌కు బ్రేక్ ఇచ్చామని చెప్తున్నారు. జనాభా లెక్కల సాకుతో ప్రజలకు అతి ముఖ్యమైన ఫుట్‌పాత్‌లను ఆక్రమణదారుల చేతుల్లోకి వదిలేయడంపై నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, నిరంతర పర్యవేక్షణ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఫుట్‌పాత్‌లు పూర్తిగా కనుమరుగై, పాదచారులు ప్రాణాలకు తెగించి రోడ్లపైనే నడవాల్సిన దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
