
- సిటీలో రెయిన్ ట్యాంకులు
- రోడ్లపై వరద నీటి నిల్వకు చెక్ పెట్టనున్న బల్దియా
- లక్ష, 5 లక్షలు, 10 లక్షల లీటర్ల కెపాసిటీతో నిర్మాణాలు
- వీటిపై ఇటీవల అసెంబ్లీలోనూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
- గ్రేటర్ సిటీలో రూ.10 కోట్లతో 50 ప్రాంతాల్లో ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: సిటీలో వానలు పడ్డప్పుడు రోడ్లపై వరద నీరు నిలిచి.. ట్రాఫిక్ జామ్లు అయ్యే ఏరియాల్లో నివారణకు బల్దియా చర్యలు చేపట్టింది. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద హోల్డింగ్ స్ర్టక్చర్లను నిర్మిస్తోంది. ఇందుకు లక్ష, 5 లక్షలు, 10 లక్షల లీటర్ల కెపాసిటీతో పాయింట్ల వారీగా ట్యాంకుల నిర్మాణాలను చేపడుతోంది. ప్రస్తుతం సిటీలో 3 నుంచి 4 సెంటి మీటర్లకుపై వాన పడితే రోడ్లపై వరద నీరు నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు ఏర్పడే పరిస్థితి ఉంది. కొన్నిచోట్ల రోడ్లను కూడా బంద్ చేస్తుంటారు. వాటర్ లాగింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ల నిర్మాణానికి ఆదేశించింది. రాజ్ భవన్, సెక్రటేరియట్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మాణాలు కొనసాగిస్తోంది. గ్రేటర్ సిటీలో రూ.10 కోట్లతో 50 ప్రాంతాల్లో నిర్మించనుంది. ఇటీవల అసెంబ్లీ సెషన్స్ లోనూ వీటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. వానలు పడ్డప్పుడు వెంటనే వరదనీరు తొలగించేందుకు వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
140 లాగింగ్ పాయింట్లు
బల్దియా పరిధిలో మొత్తం 140 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం రోడ్లపై వరదనీటిని సకాలంలో క్లియర్ చేయడానికి డీఆర్ఎఫ్ బృందాలు ఎంతో శ్రమించాల్సి వస్తోంది. ఎన్ని చర్యలు చేపట్టిన కూడా నీరు తొలగించేందుకు గంటలపాటు సమయం పడుతుంది. అప్పటి వరకు ట్రాఫిక్ జామ్ లు అవుతుంటాయి. కొన్ని లాగింగ్ పాయింట్ల వద్ద పర్మినెంట్ గా మోటార్లు ఉంచిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా ఎన్ని చర్యలు చేపట్టినా కూడా ఇబ్బందులు తొలగడంలేదు. భారీ వర్షాలు కురిస్తే సహాయక చర్యలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవ్సాల్సి ఉంటుంది . విజయవాడ నేషనల్ హైవే ఏరియాలో గంటలపాటు రాకపోకలు నిలిచిపోతుంటాయి. ప్రతిఏటా వాటర్ లాగింగ్ పాయింట్లు పెరుగుతున్నాయే తప్ప సమస్యకు చెక్ పడడం లేదు.
రెండు విధాలుగా మేలు
వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ల నిర్మాణాలతో ప్రధానంగా రెండు రకాల మేలు జరగనుంది. వర్షం పడిన వెంటనే క్షణాల్లో రెయిన్ వాటర్ రోడ్లపై నుంచి ట్యాంకుల్లోకి వెళ్తుంది. వాన తగ్గిన తర్వాత నీటిని తిరిగి భూగర్భంలోకి పంపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారు. దీంతో ఇటు ట్రాఫిక్ సమస్య చెక్ పడడంతో పాటు గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ముందుగా కొన్నిచోట్ల నిర్మాణాలు చేపట్టి ఆ తర్వాత సిటీ అంతటా చేపడతామని చెబుతున్నారు. ఇప్పటికే కొన్నింటికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తికాగా, మరికొన్నింటికి కొనసాగుతుంది. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయం ఫలితాలను ఇవ్వడమే కాకుండా ఎంత వాన పడినా ట్రాఫిక్ జామ్ లకు చెక్ పడనుంది.