బల్దియా నెత్తిన రోజుకు  కోటికిపైగా మిత్తి

బల్దియా నెత్తిన రోజుకు  కోటికిపైగా మిత్తి
  • వివిధ బ్యాంకుల్లో రూ.4,590 కోట్ల అప్పులు
  • బడ్జెట్​లో పెట్టినా..  ఒక్కపైసా ఇవ్వని ప్రభుత్వం 
  •  జీతాలు, పెన్షన్లు,  మెయింటెనెన్స్​కు పైసలు లేవు​
  • ఇప్పటికే కాంట్రాక్టర్లకు రూ. వెయ్యి కోట్లు పెండింగ్
  •  అవసరమైతే ఇంకా   అప్పులు చేసేందుకు సిద్ధం

హైదరాబాద్, వెలుగు:బల్దియా అప్పులతో నెట్టుకొస్తోంది. చేసిన అప్పులకు రోజుకు రూ. కోటికి పైగా మిత్తి కడుతోంది. సిటీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం బ్యాంకుల నుంచి రూ.4,590 కోట్లు అప్పులు తెచ్చింది.   వీటికి ఏడాదికి వడ్డీ కింద రూ.371.83 కోట్లు చెల్లిస్తోంది. అంటే రోజుకు ఒక కోటికి పైగా కడుతోంది. ప్రభుత్వం నయా పైసా ఇవ్వకపోతుండగా, అప్పులు తెచ్చి మరి పనులను పూర్తి చేస్తుండగా బల్దియాపై  తీవ్ర భారం పడింది. దీంతో ఉద్యోగులకు జీతాలు, మెయింటెనెన్స్ పనులకు పైసలు ఇవ్వడం క‌ష్టంగా మారింది. జీతం ఎప్పుడొస్తుందోనని ప్రతి నెలా ఉద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. నిధులు లేక ఆర్థిక విభాగం అధికారులు  బిల్లుల చెల్లింపులో ఒక‌టికి నాలుగు సార్లు చెక్ చేసుకోవాల్సిన దుస్థితి ఉంది.  ఇప్పటికే కాంట్రాక్టర్లకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అవి ఇచ్చేంత వరకు పనులు చేయమని వారం కిందటే కాంట్రాక్టర్లు పనులు బంద్​ పెట్టారు. ప్రస్తుతం రోడ్లు, నాలాలు తదితర మెయింటెనెన్స్​పనులు చేసేందుకు కూడా ముందుకు రావడంలేదు.   కొత్త ప్రాజెక్టులు ప్రారంభించ నున్నట్లు అధికారులు చెబుతుండగా, మళ్లీ అప్పులు చేసేందుకు బల్దియా రెడీ అవుతుంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో  ప్రభుత్వం వెంటనే బల్దియాకు నిధులు ఇవ్వాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. 
కరిగిపోయిన ఫిక్స్​డ్​ డిపాజిట్ల నిధులు​
ఒక‌ప్పుడు బ‌ల్దియా ఖజానా నిండుగా ఉండేది. ప్రస్తుతం ఖాళీ అయి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.  బల్దియా ఫిక్స్ డ్ డిపాజిట్లు కూడా క‌రిగిపోయాయి. మ‌రో వైపు ప‌న్నుల రాబడి తగ్గిపోయింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ప్రతి నెలా రూ.134 కోట్లు, మెయింటెనెన్స్​కు రూ.30 కోట్లు, రోడ్లు, నాలాలు, భ‌వ‌నాల నిర్మాణాలకు రూ.40 నుంచి 50 కోట్ల వ‌ర‌కు ఖర్చు పెడుతుంది. ఇప్పటికే కాంట్రాక్టర్లు పూర్తి చేసిన పనులకు బిల్లులు ఇచ్చేందుకు కూడా నిధులు లేవు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు పెండింగ్​లో ఉన్నాయి. 
పేరుకే బడ్జెట్​లో కేటాయింపులు
ప్రభుత్వం పేరుకే బడ్జెట్​లో కేటాయింపులు చేస్తున్నా బల్దియాకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదు. ఓ వైపు సిటీలో కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించి ఆ తర్వాత నిధులు ఇవ్వడం లేదు.  ఆ పనులను పూర్తి చేసేందుకు బల్దియా అప్పులు చేయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టులకు ఎలాంటి సాయం అందించలేదు. నిధులు ఇవ్వాలని కోరుతున్నా  ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదని బల్దియా వర్గాలు చెబుతున్నాయి.
నిధులియ్యకుంటే ఎట్ల..
కోటికి పైగా జనాభా ఉన్న సిటీకి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఎట్ల. ఎన్నికలు ఉన్నచోట వేలాది కోట్లతో స్కీమ్​లు పెడుతూ రాష్ర్ట రాజధానిని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదు. బల్దియా చెల్లిస్తున్న వడ్డీ  డబ్బులతో ఎంతో డెవలప్​మెంట్​చేయొచ్చు. బల్దియా తీసుకున్న అప్పులను వెంటనే ప్రభుత్వం తీర్చడంతో పాటు  అదనంగా నిధులు ఇయ్యాలె. నగరానికి రూ.10 వేల కోట్లు ఇవ్వాలంటూ బడ్జెట్​సమావేశాల సమయంలో ప్రభుత్వాన్ని కూడా కోరాం. స్టేట్​ఫైనాన్స్​కమిషన్ కూడా నిధుల విడుదల చేయాలని ప్రభుత్వానికి గత అక్టోబర్ లో చెప్పింది. అయినా ఇవ్వకపోతే ఎట్ల.                - ఎం.పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్​  సెక్రటరీ