సిబ్బంది బ్యాలెట్ ఓట్ మస్ట్ : GHMCలో ఎలక్షన్ ఏర్పాట్లు

సిబ్బంది బ్యాలెట్ ఓట్ మస్ట్ : GHMCలో ఎలక్షన్ ఏర్పాట్లు

హైదరాబాద్ జిల్లాలో లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లు వేగంగా పూర్తవుతున్నాయి. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి దశల వారీగా శిక్షణ ఇస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారులు.  జీహెచ్ఎంసీ ఆఫీసులో అసెంబ్లీ నియోజకవర్గాల మాస్టర్ ట్రైనర్స్, సెక్టోరియల్, రూట్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. ఈవీఎం, వీవీ ప్యాట్ లపై అవగాహనతో పాటు.. పోలింగ్ డే రోజు చేయాల్సిన పనులపై సెకండ్ లెవల్ ట్రైనింగ్ పూర్తి చేశారు. 600 మంది సిబ్బందికి రెండు విడతలుగా విభజించి ట్రైనింగ్ పూర్తి చేశారు జిల్లా ఎన్నికల అధికారులు. శిక్షణ పొందిన అధికారులకు  ఈనెల 31, ఏప్రిల్ 1, 2 తేదిల్లో పీవోలు, ఏపీవోలకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇస్తారు.

ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది తప్పని సరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు జిల్లా ఎన్నికల అధికారి దాన కిశోర్. ఓటు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించే అధికారులే ఓటు వేయకుంటే ఎలా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 23 వేల మంది వివిధ హోదాల్లో ఎన్నికల నిర్వహణలో పనిచేస్తే.. అందులో 10 వేల మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లయ్ చేసుకున్నారు. అందులో కూడా 6వేల మందే ఓటు హక్కు వినియోగించుకున్నారని.. అయితే ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

జిల్లాలో పీవోలు, ఏపీవోలు, సెక్టోరియల్ ఆఫీసర్లు కలిపి దాదాపు 18వేల వరకు ఉన్నారు. వీళ్లతో పాటు బూత్ లెవల్ ఆఫీసర్లు, వెబ్ క్యాస్టింగ్ సిబ్బంది కలిపి మరో 5వేల మంది వరకు ఉన్నారు. మొత్తం 23 వేల మందిలో.. ఇప్పటి వరకు 12వేల మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లయ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పాల్గొనే అధికారులు మాత్రం పోస్టల్ బ్యాలెట్ తీసుకోడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. అయితే తాము అప్లై చేసుకోకపోవడానికి పోస్టల్ శాఖ నిర్లక్ష్యంతో పాటు వివిధ కారణాలను జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పోస్టల్ శాఖ ….బ్యాలెట్ పంపిణీ కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను ఏర్పాటు చేసినట్లు వివరించారు దాన కిశోర్.

ఓ వైపు ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇస్తూనే మరోవైపు.. జిల్లాలో ఎన్నికలు సజావుగా జరగడానికి కావాల్సిన అన్ని రకాల  ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం లోగా ఎపిక్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తారు. అటు ఎన్నికలకు 5 రోజుల ముందే ఓటర్ స్లిప్ ల పంపిణీ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. దీంతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి, డీఆర్సీ సెంటర్ల తనిఖీలు, స్టాంగ్ రూంల ఏర్పాట్లుతో పాటు మే23న కౌంటింగ్ కేంద్రాలపై కూడా ఇప్పటి నుంచే దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు జిల్లా ఎన్నికల అధికారులు.