జీహెచ్ఎంసీలో ఫేజ్–2 పనులు స్టార్ట్​ చేసేందుకు ప్లాన్

జీహెచ్ఎంసీలో ఫేజ్–2 పనులు స్టార్ట్​ చేసేందుకు ప్లాన్
  • రూ.3,500 కోట్లతో మరో 12 ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్లాన్
  • ప్రభుత్వ అనుమతుల కోసం బల్దియా అధికారులు వెయిటింగ్​
  • మొదటి విడతలోని 47 ఎస్ఆర్​డీపీ పనుల్లో ఇంకా 18  పెండింగ్
  • ముందు ఆ పనులను పూర్తి చేయాలంటున్న  ఎక్స్​పర్ట్స్​

హైదరాబాద్, వెలుగు:స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్​మెంట్ ప్లాన్(ఎస్ఆర్ డీపీ) ఫేజ్–1 పనులు పూర్తికాక ముందే ఫేజ్–2 పనులను స్టార్ట్​ చేసేందుకు బల్దియాప్లాన్ చేస్తోంది. సిటీలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్​లు, ఆర్ఓబీలు, ఆర్​యూబీలు నిర్మించేందుకు ఎస్ఆర్​డీపీని రూపొందించింది. అందులో భాగంగా మొదటి విడతలో రూ.8,092కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టగా 29 పూర్తయ్యాయి. ప్రస్తుతం18 ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయి. వీటిలో మేజర్​గా కైత్లాపూర్ కుడివైపు ఫ్లైఓవర్, చాంద్రాయణగుట్ట, నాగోలు, వీఎస్​టీ ఫ్లై ఓవర్లు ఉన్నాయి. ఇవి పూర్తికాక ముందే రూ.3,500 కోట్లతో సెకండ్ ఫేజ్ పనుల స్టార్ట్​చేయాలని జీహెచ్ఎంసీ ఆఫీసర్లు నిర్ణయించారు. 12 ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పరిపాలన అనుమతులు వస్తే పనులు స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఫేజ్–1లో భాగంగా ప్రారంభించిన పనులను పూర్తి చేశాక ఫేజ్–2కు వెళ్తే బాగుంటుందని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. కేవలం ప్రచారం కోసమే కాకుండా స్టార్ట్​ చేసినవి పూర్తిగా చేయాలని చెప్తున్నారు.

పర్మిషన్ వస్తే ఈ ప్రాంతాల్లో..
ఎస్ఆర్​డీపీ ఫేజ్–2 పనులకు ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు ఇస్తే ముందుగా 12 ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఇందులో ఉప్పల్ జంక్షన్ లో మరో ఫ్లైఓవర్, కూకట్​పల్లి వైజంక్షన్, బండ్లగూడలో ఫ్లైఓవర్, ఒమర్ హోటల్ జంక్షన్, రేతిబౌలి–నానల్‌నగర్‌లో మల్టీలెవల్ అండర్‌పాస్, ఫలక్ నుమా ఆర్ఓబీ, కుత్బుల్లాపూర్‌లో ఫాక్స్ సాగర్ పైప్‌లైన్‌పై వంతెన నిర్మాణం, ఖాజాగూడలో సొరంగం, మాణికేశ్వర్ నగర్ ఆర్ యూబీ, చిలకలగూడలో ఆర్​యూబీ, ఆరాంఘర్‌లో రెండు రూబీలు ఉన్నాయి. ఈ పనుల తరువాత మరికొన్ని చేపట్టాలని ఆలోచిస్తున్నారు. వాటితో పాటే కొత్తవిసిటీలో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్​లు, ఆర్ఓబీలు, ఆర్​యూబీలు నిర్మించేందుకు బల్దియా మొత్తం 23 వేల500కోట్లతో ఎస్ఆర్​డీపీని రూపొందించింది. ఫేజ్–1లో ఇప్పటికే 29 ప్రాజెక్టులు పూర్తి కాగా.. మరో 18 పనులు నడుస్తున్నాయి. ఫేజ్–2 స్టార్ట్​ చేస్తామని బల్దియా ఆఫీసర్లు చెప్తుండడంతో పాతవాటిని త్వరగా పూర్తి చేయాలని జనం కోరుతున్నారు.   ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే ఫేజ్–1 పనులు చేస్తూనే ఫేజ్–2 మొదలు పెడతామని  అధికారులు అంటున్నారు.  

పెండింగ్ ప్రాజెక్టులివే..
కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ బొటానికల్​గార్డెన్ వద్ద మల్టీలెవల్ ఫ్లైఓవర్, గ్రేడ్ సెపరేట్లు, శిల్పా లేఅవుట్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు రోడ్డు నిర్మాణం, ఖైత్లాపూర్ ఆర్ఓబీ, నాగోలు ఫ్లైఓవర్, ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు ఎలివేటెడ్ కారిడార్, ఉప్పల్​జంక్షన్ ఫ్లైఓవర్, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్, సంతోష్ నగర్ ఎలివేటెడ్ కారిడార్, ఫలక్ నుమా ఆర్ఓబీ, శాస్ర్తిపురం ఆర్ఓబీ, ఆరాంఘర్–జూపార్కు ఫ్లైఓవర్, ఎల్బీనగర్ ఆర్ హెచ్ఎస్, బైరామల్​గూడ వద్ద నాలుగు ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయి. వీటి పనులు స్లోగా సాగుతున్నాయి.