జీహెచ్‌‌‌‌ఎంసీకి మస్త్ ఆమ్దానీ!..విలీనం తర్వాత రూ.6 వేల కోట్లు దాటే చాన్స్

జీహెచ్‌‌‌‌ఎంసీకి మస్త్ ఆమ్దానీ!..విలీనం తర్వాత రూ.6 వేల కోట్లు దాటే చాన్స్
  • టౌన్ ప్లానింగ్, ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి భారీ రెవెన్యూ
  •  హైరైజ్ బిల్డింగ్​ల నుంచే రూ.వెయ్యి కోట్లు
  • హెచ్ఎండీఏకు తగ్గే ఆదాయం జీహెచ్ఎంసీకి బదిలీ

​హైదరాబాద్ సిటీ, వెలుగు: విలీనం తర్వాత జీహెచ్‌‌‌‌ఎంసీకి ఆదాయం భారీగా పెరగనుంది. గతేడాది రూ.3,321 కోట్లు వచ్చిన ఆదాయం.. 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో రూ.6 వేల కోట్లు దాటే అవకాశం కన్పిస్తున్నది. ప్రధానంగా బల్దియాకు టౌన్ ప్లానింగ్, ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్, అడ్వటైజ్ మెంట్, ఎస్టేట్ విభాగాల నుంచి భారీ ఆదాయం వస్తున్నది. 

విలీనం కాకముందు టౌన్ ప్లానింగ్ నుంచి సంవత్సరానికి రూ. వెయ్యి కోట్లు వచ్చేది. ఇప్పుడు రెండింతలు పెరిగే అవకాశం ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి వచ్చే ఆదాయం రూ.2 వేల కోట్లు ఉండగా, వచ్చే ఏడాది నుంచి రూ.3,500 కోట్లు దాటే అవకాశం ఉంది. మరోవైపు మిగిలిన విభాగాలు, పన్ను వసూళ్ల నుంచి కూడా విలీన ప్రాంతాలను భారీగా ఆదాయం వచ్చే చాన్స్​ఉందని అధికారులు చెప్తున్నారు.  

ఒక్కసారిగా పెరగనున్న ఆదాయం

ప్రస్తుతం విలీనమైన ప్రాంతాల్లో హైరైజ్ బిల్డింగ్ నిర్మాణాలు భారీగా జరుగుతుండడంతో జీహెచ్‌‌‌‌ఎంసీ ఆదాయం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ బిల్డింగ్​లకు హెచ్‌‌‌‌ఎండీఏ జారీ చేసిన అనుమతులన్నీ ఇకపై జీహెచ్‌‌‌‌ఎంసీ ఇవ్వనుంది. తెల్లాపూర్, అమీన్​పూర్, పోచారం, శంషాబాద్, బండ్లగూడ జాగీర్, జల్​పల్లి, నిజాంపేట్, మణికొండ, బడంగ్​పేట్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మాణాలు జరుగుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాంతాల నుంచే సుమారు వెయ్యి కోట్ల ఆదాయం జీహెచ్‌‌‌‌ఎంసీకి వచ్చే అవకాశం ఉంది. హెచ్‌‌‌‌ఎండీఏకి తగ్గిన ఆదాయం పూర్తిగా జీహెచ్‌‌‌‌ఎంసీకి బదిలీ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అభివృద్ధితోపాటు తీరనున్న అప్పులు

జీహెచ్ఎంసీ విలీనం తరువాత ముఖ్యంగా అప్పులు తీరనున్నాయి. గత ప్రభుత్వం హయాంలో జీహెచ్ఎంసీ వివిధ పనుల కోసం బ్యాంకులో రూ.6,880 కోట్ల అప్పులు చేసింది. ఇందులో స్టాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రొగ్రాం(ఎస్ఆర్డీపీ) కోసం  రూ.4,250 కోట్లు అప్పు చేయగా, బాండ్ల ద్వారా 495 కోట్లు సేకరించింది. రూ.200 కోట్లకు 8.90 శాతం, 195 కోట్లకు 9.38 శాతం, రూ.100 కోట్లకు 10.23 శాతం వడ్డీకి కడుతోంది.

 రూ.2,500 కోట్లను 8.65 శాతం వడ్డీకి రూపీ టర్న్ లోన్ తీసుకోగా, మరోసారి రూ.505 కోట్లను 7.75 శాతం వడ్డీకి రూపీ టర్మ్ లోన్ తీసుకుంది. వీటితో పాటు మరో రూ.750 కోట్లను ఇటీవల సేకరించింది. కాంప్రెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రాం(సీఆర్ఎంపీ) కోసం 7.20 శాతం వడ్డీతో మరో రూ.1,460 కోట్లు తీసుకుంది.  ఎస్ఎన్డీపీ కోసం రూ.680 కోట్లని 7.20 శాతం వడ్డీతో తీసుకుంది. 

అలాగే జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్లకోసం రూ.140 కోట్ల హడ్కో లోన్ సేకరించింది. ఇందులో రూ.100 కోట్లను 8.90 శాతం వడ్డీతో తీసుకోగా, రూ.40 కోట్లను 9.90 శాతం వడ్డీతో తీసుకుంది. వీటితో పాటు కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల కోసం ట్రేడ్స్ ద్వారా రూ.350 కోట్ల అప్పు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.6,880 కోట్ల అప్పుల్లో  రూ.1,100 కోట్లను కిస్తీల వారీగా తిరిగి చెల్లించింది. 

ప్రస్తుతం రూ.5,500 కోట్ల అప్పులున్నాయి. రెగ్యులర్​గా తిరిగి చెల్లిస్తుండడంతో అసలుతో పాటు మిత్తి కూడా  కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఆదాయం పెరుగుతుండటంతో అప్పులు తిరిగి చెల్లించేందుకు మరింత ఈజీగా ఉంటుంది. అలాగే ఒకవేళ అభివృద్ధికోసం అవసరమైతే మళ్లీ అప్పులు కూడా పుట్టే అవకాశం ఉంది.