నాలాలో పడి చిన్నారి మృతి ఘటనపై జీహెచ్ఎంసీ చర్యలు

నాలాలో పడి చిన్నారి మృతి ఘటనపై  జీహెచ్ఎంసీ చర్యలు

సికింద్రాబాద్ కళాసిగూడ నాలాలో పడి మృతి చెందిన ఘటనను జీహెచ్ఎంసీ సీరియస్ గా  తీసుకుంది. ఘటనకు కారులకులైన వారిపై వేటు వేసింది. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. వర్క్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణతో పాటు బేగంపేట్ డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమలయ్యను  సస్పెండ్ చేశారు.10 రోజుల్లోగా ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని సదరు అధికారులను ఆదేశించింది.

మ్యాన్​ హోల్​ లో పడి మౌనిక ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని.. ఇటువంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ వెల్లడించింది. అంతకుముందు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ తరుపున బాధిత కుటుంబానికి రూ. రెండు లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు.

ఏప్రిల్ 29న ఉదయం సికింద్రాబాద్ లోని కళాసిగూడ వద్ద ప్రమాదవశాత్తు నాలాలో  పడి మౌనిక(6) మృతి చెందింది. తెల్లవారుజామున నుంచి కళాసిగూడలో ఎడతెరపిలేకుండా కురుస్తోంది. దీంతో రోడ్లపైకి వర్షపునీరు పారుతోంది.  డ్రైనేజీ పనులు జరుగుతుండటంతో మ్యాన్ హోల్  మూత తెరిచి ఉంచారు.  అది గమనించని చిన్నారి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా అందులో పడింది. దీంతో చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. కిరాణ షాప్ కి పాల పాకెట్ కోసం వెళ్లగా..ఈ దుర్షఘటన చోటు చేసుకుంది.