
- 36 చోట్ల స్థలాల పరిశీలన
- చెత్త సేకరణలో ఇబ్బందులకు చెక్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో చెత్త సేకరణ సమస్యను తగ్గించేందుకు జీహెచ్‌ఎంసీ సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్లను పెంచనుంది. ప్రస్తుతం 42 ఉన్న ఈ స్టేషన్ల సంఖ్యను మరో 18కి పెంచి మొత్తం 60కి చేర్చనున్నారు. దీనికి సంబంధించి 36 చోట్ల స్థలాలను బల్దియా అధికారులు పరిశీలించారు. ఇందులో 18 ప్రాంతాలను అధికారులు ఫైనల్ చేసి, త్వరలోనే నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. నగరంలో రోజువారీ చెత్త ఉత్పత్తి 8 వేల టన్నులకు చేరడంతో సెకండరీ కలెక్షన్ పాయింట్లకు చెత్తను తరలించి, అక్కడి నుంచి జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే స్వచ్ఛ ఆటోలు ట్రాన్స్ఫర్ స్టేషన్ల వద్ద క్యూ కడుతుండడంతో ఆన్లోడింగ్కు టైమ్పడుతోంది. ఫలితంగా, కాలనీల్లో చెత్త సేకరణ ఆలస్యమవుతూ, కవరేజ్ ప్రాంతాలు తగ్గుతున్నాయి. అలాగే సెకండరీ స్టేషన్లపై లోడ్పెరిగి చుట్టుపక్కల ప్రాంతాల్లో భరించలేని కంపుకొడుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ట్రాన్స్ఫర్ స్టేషన్లతో ఈ సమస్యలు తీరనున్నాయని అధికారులు చెప్తున్నారు.