సైబరాబాద్, మల్కాజిగిరికి రూ.వెయ్యి కోట్లు.. ఆస్తులు, అప్పులు తేల్చేందుకు టాస్క్ఫోర్స్

సైబరాబాద్, మల్కాజిగిరికి రూ.వెయ్యి కోట్లు.. ఆస్తులు, అప్పులు తేల్చేందుకు టాస్క్ఫోర్స్
  • మార్చి వరకు జీహెచ్ఎంసీ నుంచే బిల్లులు, జీతాల చెల్లింపులు 
  • స్పెషల్ ఆఫీసర్ జయేశ్​ రంజన్​
  • మొదటిసారి మూడు కార్పొరేషన్ల అధికారులతో  స్టాండింగ్ కమిటీ సమావేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపల్​కార్పొరేషన్ల స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ అధ్యక్షతన ఆయా కార్యాలయాల్లో గురువారం మొదటిసారి స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించారు.  మాదాపూర్ న్యాక్ బిల్డింగ్​లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆఫీస్​లో సీఎస్ కె రామకృష్ణారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించగా, సైబరాబాద్ కమిషనర్ జి.సృజన, జలమండలి ఎండీ  కె.అశోక్ రెడ్డి పాల్గొన్నారు. తార్నాకలోని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) ఆఫీసులో నిర్వహించిన స్టాండింగ్​కమిటీ మీటింగులో  కమిషనర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి, వాటర్ బోర్డు ఈడీ, అడిషనల్ కమిషన్లు. జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.

జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ హెడ్ ఆఫీసులో జరిగిన మీటింగ్​లో మూడు ఎజెండా అంశాలపై చర్చించారు. కోర్ అర్బన్ రీజియన్ పునర్​వ్యవస్థీకరణ, సైబరాబాద్, మల్కాజిగిరి, గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు ప్రతి కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక కార్పొరేట్ హోదా, చట్టబద్ధ హక్కులు, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు సిబ్బంది కేటాయింపు, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు రూ.500 కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయింపు వంటి ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ అమోదం తెలిపింది. చెత్త నిర్వహణ, డంపింగ్ యార్డులు, ఆల్టర్నేట్​ప్రపోజల్స్, వాటర్ లాగింగ్ పాయింట్లు, పరిష్కారం, మౌలిక సదుపాయాలు, ఇతర పనులు పురోగతి గురించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

గొప్ప అవకాశంగా భావించి పని చేయండి.. 

స్పెషల్ ఆఫీసర్ జయేశ్​రంజన్​ మాట్లాడుతూ.. అధికారులు మెరుగైన సేవలు అందించేందుకు లభించిన గొప్ప అవకాశంగా దీన్ని భావించాలన్నారు. 6 నెలల్లో వ్యవస్థను పటిష్టం చేస్తూ ఎన్నడూ లేని విధంగా ప్రజా సమస్యలు లేకుండా చేయాలన్నారు. ఎస్ఆర్డీపీ, ఎస్​న్డీపీ, హెచ్ సిటీ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. నాలాల డీ సిల్టింగ్ పనులను త్వరగా ప్రారంభించాలన్నారు. నగరంలో గుంతలు లేకుండా, స్ట్రీట్ లైట్లు వెలిగేలా చూడాలన్నారు. మార్చి వరకు మూడు కార్పొరేషన్లకి సంబంధించిన జీతాల, పలు బిల్లులు జీహెచ్ఎంసీ నుంచే అందిస్తామన్నారు. 

పారిశుధ్య పోటీలు.. ప్రోత్సాహకాలు

పారిశుధ్యం మరింత మెరుగుపరిచేందుకు మూడు కార్పొరేషన్లకు ఈ అంశంలో పోటీలను నిర్వహించనున్నట్లు స్పెషల్ ఆఫీసర్ జయేశ్​రంజన్​తెలిపారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ లేని వార్డులు, సర్కిల్, కార్పొరేషన్లను తీర్చిదిద్దిన అధికారులకు ప్రశంసా పత్రాలు, ఆర్థిక నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు  తెలిపారు.  ఈ అంశాల్లో క్రియాశీలక భాగస్వామ్యమైన కార్పొరేటర్లు, ఎన్జీవోలు, అధికారులు, వ్యక్తులకు కూడా ప్రశంస పత్రాలు అందిస్తామన్నారు.

మూడు కార్పొరేషన్లకు  కొత్త వెబ్​సైట్స్

జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలకు సంబంధించి ప్రత్యేకంగా వెబ్ సైట్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయా కార్పొరేషన్లకి సంబంధించిన అధికారుల వివరాలను వెబ్ సైట్ లో పొందుపర్చారు. అలాగే ఆన్ లైన్ ద్వారా  అందించే సేవల వివరాలను  పొందుపర్చారు. జీహెచ్ఎంసీకి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లు 21111111, 040-23225397 ఉండగా, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి లకు సంబంధించి ఇంకా నెంబర్లను కేటాయించకపోవడంతో అందుబాటులోలేవు.

10 రోజుల్లో ఆస్తులు, అప్పులు కేటాయింపులు

జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్ గా పునర్వ్యవస్థీకరణ అయిన నేపథ్యంలో ఆస్తులు, అప్పులు, సిబ్బందిని  మూడు కార్పొరేషన్లకు కేటాయించేందుకు సెంట్రల్ ఫర్​గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు ప్రత్యేక అధికారి జయేష్ రంజన్  తెలిపారు. అప్పులు , ఆస్తులను టాస్క్ ఫోర్స్ కమిటీ డిస్టిబ్యూట్ చేస్తుందన్నారు. కేటాయింపులు, ఒప్పందాలు వంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి  10 రోజుల్లో టాస్క్ ఫోర్స్ శాస్త్రీయంగా కేటాయింపులు చేస్తుందని  తెలిపారు.