- ఇప్పటివరకు 35 వేల ట్రేడ్స్ నుంచి రూ.50 కోట్ల వసూల్
- ఈ నెల 20తో ముగిసిన రెన్యువల్ గడువు
- స్పందించని వారికి నోటీసులు జారీ చేసి మరీ కలెక్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్రేడ్ లైసెన్స్ ఫీజు కలెక్షన్‌పై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. వచ్చే 2026 సంవత్సరానికి సంబంధించి ఆదివారం నుంచి జరిమానాలతో వసూలు చేయనుంది. ఫీజు ఎగ్గొడుతున్న వారిపై చర్యలు తీసుకుని మరీ కలెక్షన్ చేపట్టనుంది. ట్రేడ్ లైసెన్స్‌కు సంబంధించి జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా 2025లో (ఈ ఏడాదిలో) రూ.100 కోట్ల మార్కు దాటింది. ఇప్పటివరకు 1,13,000 ట్రేడ్స్ నుంచి రూ.112 కోట్లు వసూలైంది. ఈ 10 రోజుల్లో మరో రూ.2 కోట్లు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా. గ్రేటర్ పరిధిలో 3,17,033 నాన్-రెసిడెన్షియల్ ప్రాపర్టీలు ఉండగా, ఇందులో చిన్నచిన్నవి వదిలిపెట్టినా కనీసం 2 లక్షల ట్రేడ్ లైసెన్స్‌లు జారీ కావాల్సి ఉంది. సర్కిల్ స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో ఆదాయం తగ్గుతోందని, ప్రతి వ్యాపారి వద్ద తనిఖీ చేస్తే ట్రేడ్ ఫీజు ఆదాయం భారీగా పెరిగే చాన్స్ ఉందని అంచనా. ఇదే విషయమై కమిషనర్ ఆర్వీ కర్ణన్ సీరియస్‌గా ఉన్నారు. వ్యాపారాలు చేస్తూ జీహెచ్ఎంసీకి ఫీజు చెల్లించని వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలొద్దని ఆదేశాలు జారీ చేశారు.
ఇంకా స్పందించని 70 శాతం మంది
వచ్చే సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్సులను ఈ నెల 20లోపు రెన్యువల్ చేసుకోవాలని ఇప్పటికే జీహెచ్ఎంసీ కోరింది. ఇంతలోపు కేవలం 35 వేల మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. ఇంకా 70 శాతానికి పైగా మంది స్పందించలేదు. నిర్ణయించిన గడువు లోపు రెన్యువల్ చేస్తే ఎటువంటి పెనాల్టీ ఉండదు. ఆదివారం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 వరకు రెన్యూవల్ చేసుకునే వారికి 25శాతం పెనాల్టీతో కలెక్ట్ చేయనున్నారు. అదే ఫిబ్రవరి 20 తరువాత చెల్లించే వారి నుంచి 50 జరిమానాతో వసూల్ చేయనున్నారు.
ఓఆర్ఆర్ పరిధితో పెరగనున్న కలెక్షన్
జీహెచ్ఎంసీ విస్తరణ తరువాత ఓఆర్ఆర్ వరకు బల్దియా పరిధి పెరిగింది. దీంతో సర్కిళ్లు 30 నుంచి 57కి పెరిగాయి. అంతేకాకుండా వార్డులు కూడా 150 నుంచి 300 కు పెరిగాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే విలీనమైన లోకల్ బాడీల్లో ఆర్థిక సంవత్సం ప్రకారం ట్రేడ్ లైసెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రాంతాల్లో కూడా మార్పులు చేయనున్నారు.
