త్వరలో 4 వేల ‘డబుల్’ఇండ్ల పంపిణీ..2017–2019 మధ్య అప్లయ్​ చేసుకున్న వారికి మాత్రమే..

త్వరలో 4 వేల ‘డబుల్’ఇండ్ల పంపిణీ..2017–2019 మధ్య అప్లయ్​ చేసుకున్న వారికి మాత్రమే..
  • నాలుగు జిల్లాల కలెక్టర్లకు లెటర్లు రాసిన జీహెచ్ఎంసీ 
  • గ్రేటర్​పరిధిలో 70 వేల ఇండ్ల నిర్మాణం పూర్తి
  • ఇప్పటికే 66 వేల మంది లబ్ధిదారులకు పంపిణీ  
  • తాళాలు తీసుకుని వేరే చోట ఉంటున్న 30 వేల మంది  
  • ‘డబుల్’​ ఇండ్లలోకి రాకపోతే వేరే వాళ్లకు ఇస్తామంటూ నోటీసులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో నిర్మించి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్​రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాలని నాలుగు జిల్లాల కలెక్టర్లకు జీహెచ్ఎంసీ అధికారులు 15 రోజుల కింద లెటర్లు రాశారు. హైదరాబాద్ జిల్లాలో 1,400,  సంగారెడ్డి జిల్లాలో 802,  మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో 1,043, రంగారెడ్డి జిల్లాలో 800 ఇండ్లు కలిపి 4 వేల ఇండ్లు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. వీటిని అర్హులైన వారికి ఆయా జిల్లాల కలెక్టర్లు త్వరలో అందజేయనున్నారు. నాలుగు జిల్లాల పరిధిలో మొత్తం 70 వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా, కొల్లూరులోనే అత్యధికంగా 15,660 ఇండ్లను నిర్మించారు. 

అద్దెకు ఇచ్చి వేరే చోట నివాసం

ఇప్పటివరకు 66 వేల ఇండ్లను లబ్ధిదారులకు అందజేయగా, ఇందులో 30 వేల మంది వరకు ఇండ్లలోకి రాలేదు. వీరంతా తాళాలు తీసుకొని వేరే ప్రాంతాల్లోనే ఉంటున్నట్టు తెలిసింది. మరికొందరు అద్దెలకు ఇచ్చి వేరేచోట ఉంటున్నారు. ఇటువంటి వారిని గుర్తిస్తున్న జిల్లాల కలెక్టర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. అయినా, ఇండ్లలోకి  రాకపోతే వాటిని వేరేవాళ్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

అయితే, డబుల్ బెడ్​రూం ఇండ్లలో ఉంటే తమ ఉద్యోగాలకు దూరం అవుతోందని, అందుకే ఉండడం లేదని కొందరు లబ్ధిదారులు చెప్తున్నారు. మరికొందరు తమకు వచ్చిన డబుల్​ బెడ్​రూంలను అద్దెకు ఇచ్చి ఉద్యోగం చేసే చోటికి దగ్గరలో రెంట్​తీసుకుని ఉంటున్నారు.
  
కొనసాగుతున్న నిర్మాణాలు..

జీహెచ్ఎంసీ మొదట మొత్తం 111 ప్రాంతాల్లో లక్ష డబుల్​ బెడ్​రూం ఇండ్లను నిర్మించాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో 49 మురికి వాడల్లో 9,828 ఇండ్లు, 68 ఖాళీ స్థలాల్లో 90,172 ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టింది. 70 వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తికాగా 66 వేల ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఇంకా కొన్నింటి నిర్మాణం జరుగుతుండగా, కొన్ని ఇండ్ల నిర్మాణం పెండింగ్ లో పడింది.

2017 నుంచి 2019 వరకు గ్రేటర్ లో డబుల్ బెడ్​రూం ఇండ్ల కోసం 7.10 లక్షల అప్లికేషన్లు రాగా,  ఇందులో 95 వేల మంది మాత్రమే అర్హులని అధికారులు గుర్తించి ఇండ్లను అందజేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 12 శాతం మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. ఇందులో ఇంకా 25 వేల మందికి ఇండ్లు అందాల్సి ఉంది. త్వరలో 4 వేల ఇండ్లను ఈ 25వేల మంది నుంచే గుర్తించనున్నారు.