హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రౌండ్ లేదనే సాకుతో కొన్ని వందల సర్కారు బడులకు ఈ ఏడాది 'స్పోర్ట్స్ గ్రాంట్స్' మంజూరు చేయకపోవడం సరికాదని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ సమగ్ర శిక్ష స్టేట్ అడిషనల్ డైరెక్టర్ రాధారెడ్డిని ఆ సంఘం నేతలతో కలిసి వినతిపత్రం అందించారు. ఆట స్థలం లేదనే సాకుతో నిధులు ఆపేయడంతో హెడ్మాస్టర్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇండోర్ గేమ్స్ కు స్పోర్ట్స్ గ్రాంట్స్ ఇవ్వాలని కోరారు.
గతేడాది 'యూడైస్ ప్లస్' డేటాలో..స్కూల్ ఇన్ఫర్మేషన్ నింపేటప్పుడు ఆట స్థలం లేదని నమోదు చేసిన బడులకు ఆఫీసర్లు ఈసారి స్పోర్ట్స్ గ్రాంట్స్ నిలిపివేశారని చెప్పారు. స్కూల్ కు గ్రౌండ్ లేకపోతే చెస్, క్యారమ్స్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడించుకుంటామని.. కనీసం ఆ మెటీరియల్ కోసమైనా గ్రాంట్స్ రిలీజ్ చేయాలని కోరారు. 10 మంది లోపు స్టూడెంట్స్ ఉన్న బడులకు కూడా స్కూల్ గ్రాంట్స్ ఆపేశారని, వాటిని వెంటనే విడుదల చేయాలని సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు.
