సబర్మతి జైలులో టెర్రరిస్ట్ అహ్మద్ మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌ను.. చితకబాదిన ఖైదీలు

సబర్మతి జైలులో టెర్రరిస్ట్ అహ్మద్ మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌ను.. చితకబాదిన ఖైదీలు
  • గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని సబర్మతి జైలులో ఘటన

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆముదం గింజల నుంచి రైసిన్ విషం తయారు చేసి దేశంలో విష ప్రయోగాలకు ప్లాన్ చేసిన టెర్రరిస్ట్ అహ్మద్ మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌ సయ్యద్‌‌‌‌‌‌‌‌పై గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని సబర్మతి జైలులో దాడి జరిగింది. అతడిని ముగ్గురు ఖైదీలు చితకబాదారు. ఈ దాడిలో మొహియుద్దీన్ ముఖం, కంటిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జైలు సిబ్బంది అతన్ని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్, రాజేంద్రనగర్ ఫోర్త్‌‌‌‌‌‌‌‌వ్యూ కాలనీకి చెందిన మొహియుద్దీన్ సయ్యద్‌‌‌‌‌‌‌‌ను ఈ నెల 7న గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. 

అతనితో పాటు ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహైల్ సలీమ్‌‌‌‌‌‌‌‌లను కూడా అరెస్టు చేసి సబర్మతి జైలులో రిమాండ్‌‌‌‌‌‌‌‌కు పంపారు. అయితే, మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌ను హై సెక్యూరిటీ సెల్‌‌‌‌‌‌‌‌లో ఉంచినప్పటికీ, మంగళవారం ఉదయం అతనితో పాటు అరెస్టయిన ఆజాద్ సులేమాన్ షేక్, సుహైల్‌‌‌‌‌‌‌‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదంలో అక్కడే ఉన్న మరో ముగ్గురు ఖైదీలు అనిల్ కుమార్, శివమ్ శర్మ, అంకిత్ లోడీ జోక్యం చేసుకున్నారు. 

దాంతో వాగ్వాదం ముదిరి ఈ ముగ్గురు కర్రతో మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌పై దాడి చేశారని అధికారులు వెల్లడించారు. ఘటనపై గుజరాత్ ఏటీఎస్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.  దాడి చేసిన ముగ్గురిలో ఒకరు హత్య కేసు, ఒకరు ఆర్థిక నేరం, మరొకరు పోక్సో కేసులో శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. కాగా..ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు బ్లాస్ట్‌‌‌‌‌‌‌‌కు ముందే పోలీసులు మొహియుద్దీన్ సయ్యద్, మహమ్మద్ సుహైల్, ఆజాద్‌‌‌‌‌‌‌‌లను -అరెస్టు చేశారు. ఈ ముగ్గురు ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌‌‌‌‌‌‌‌కేపీ)కు చెందిన టెర్రర్ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌కు చెందిన వారిగా గుర్తించారు.