పెళ్లి తర్వాత గొడవలే కథాంశంగా ప్రేమంటే

పెళ్లి తర్వాత గొడవలే కథాంశంగా  ప్రేమంటే

ప్రియదర్శి, ఆనంది జంటగా నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన చిత్రం ‘ప్రేమంటే’. థ్రిల్లు ప్రాప్తిరస్తు అనేది ట్యాగ్‌‌లైన్‌‌. శుక్రవారం సినిమా విడుదలవుతున్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాగచైతన్య మాట్లాడుతూ ‘ఈ బ్యానర్‌‌‌‌లో నటించిన ‘లవ్‌‌ స్టోరీ’తో శేఖర్ కమ్ముల నాకు పరిచయమవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు ‘ప్రేమంటే’ అనే మరో లవ్‌‌ స్టోరీ ప్రమోషన్‌‌కు రావడం హ్యాపీ. మంచి పాయింట్‌‌తో ఈ కొత్త ప్రేమకథ రాబోతోంది.  అన్నిరకాల పాత్రలను అవలీలగా పోషిస్తాడు ప్రియదర్శి. 

సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని విష్ చేశాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత సురేష్ బాబు బెస్ట్ విషెస్‌‌ చెప్పారు.  ఈ మూవీ టీమ్‌‌తో వర్క్‌‌ చేయడం సంతోషంగా ఉందని,  అందరినీ ఎంటర్‌‌‌‌టైన్‌‌ చేసేలా సినిమా ఉంటుందని ప్రియదర్శి చెప్పాడు. తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న తనకు తెలుగులో మాత్రం ఇంకా ప్రూవ్ చేసుకోలేదని లోటు ఉందని, ఈ చిత్రంతో అది తీరిపోతుందని ఆనంది చెప్పింది. 

‘‘పెళ్లి తరువాత ఎన్ని గొడవలు వచ్చినా సరే.. ఓ టీ తాగుతూ మాట్లాడుకుని పరిష్కరించుకోవాలనేదే ఈ మూవీ కాన్సెప్ట్‌‌’ అని దర్శకుడు తెలిపాడు.  సుమ కనకాల, హైపర్ ఆది, నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌‌ మోహన్ రావు, జాన్వీ నారంగ్,  మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.