తిరుమల లడ్డూ ప్రసాదానికి GI గుర్తింపు : టీటీడీకి FSSAI లైసెన్స్

తిరుమల లడ్డూ ప్రసాదానికి GI గుర్తింపు : టీటీడీకి FSSAI లైసెన్స్

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూకు భారత ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపును మంజూరు చేసింది. అదేవిధంగా లడ్డూ తయారీ, విక్రయాలకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ కూడా టీటీడీకి లభించింది. దీంతో శ్రీవారి లడ్డూ నాణ్యత, ప్రామాణికత మరింత బలోపేతమైంది.

అత్యాధునిక సాంకేతికతతో నాణ్యత నియంత్రణ

ప్రసాదాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల్లో ఎలాంటి మలినాలు లేకుండా చూసేందుకు శ్రీవారి పోటులో రెండు అత్యాధునిక ఏఐ ఆధారిత కలర్ సార్టింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ముడి పదార్థాల్లోని మలినాలను తొలగించి అత్యుత్తమ నాణ్యత గల ముడి సరుకులను మాత్రమే వినియోగిస్తున్నారు. అలాగే పోటు విభాగానికి అవసరమైన అన్ని ముడి సరుకులను కొనుగోలు విభాగం సేకరించి, ప్రయోగశాల పరీక్షలు నిర్వహించిన అనంతరమే వినియోగానికి అనుమతిస్తోంది.

సంప్రదాయ దిట్టం ప్రకారమే తయారీ

శ్రీవారి ప్రసాదాల తయారీలో 1950, 1951 సంవత్సరాల్లో టీటీడీ ఆమోదించిన సంప్రదాయ "దిట్టం" ప్రమాణాలను నేటికీ ఖచ్చితంగా పాటిస్తున్నారు. నిత్య, వార, పక్ష, మాస, నక్షత్ర, సాలకట్ల ఉత్సవాలకు అనుగుణంగా సుమారు 20 రకాల అన్నప్రసాదాలు, 25 రకాల పలహారాలను సిద్ధం చేస్తున్నారు.

24 గంటలూ నిరంతరాయంగా సేవలు

శ్రీవారి పోటులో రెండు షిఫ్టుల్లో సుమారు 700 మంది శ్రీవైష్ణవ బ్రాహ్మణులు భక్తి శ్రద్ధలతో 24 గంటలూ సేవలందిస్తూ లడ్డూ ప్రసాదాల తయారీలో పాల్గొంటున్నారు. వీరికి టీటీడీ సిబ్బంది, పర్యవేక్షకులు సహకరిస్తున్నారు.

భారీ మౌలిక సదుపాయాలు

లడ్డూ తయారీ ప్రక్రియలో భాగంగా బూంది పోటు, పడి పోటు, అదనపు పోటు, అంతర్గత పోటు వంటి ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయి.

  • రోజుకు 15 టన్నుల శెనగపప్పును పిండిగా మార్చే ఫ్లోర్ మిల్
  • 2లక్షల10వేల కిలోల సామర్థ్యం గల నెయ్యి నిల్వ ట్యాంకులు
  • 30 టన్నుల సామర్థ్యం గల గ్యాస్ ప్లాంట్
  • 2 నుండి 7 రోజుల వరకు ముడి సరుకులు నిల్వ ఉంచగల ఉగ్రాణం
  • కన్వేయర్ బెల్ట్ వ్యవస్థ ద్వారా బూంది తరలింపు వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు

తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్‌లో 56 కౌంటర్ల ద్వారా మూడు షిఫ్టుల్లో 24 గంటలూ లడ్డూల విక్రయం, పంపిణీ జరుగుతోంది. అదనపు లడ్డూల కొనుగోలు కోసం డిజిటల్ చెల్లింపులతో పనిచేసే కియోస్క్ యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. దర్శనం పొందిన ప్రతి భక్తునికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తున్నారు.

ప్రత్యేక రోజులకు భారీ బఫర్ స్టాక్

భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో ఎలాంటి కొరత రాకుండా 8 లక్షల నుండి 10 లక్షల లడ్డూల వరకు బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుతున్నారు.ఇటీవలి కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచి మరింత మెరుగుపడటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత, సంప్రదాయం, భక్తి భావనల సమ్మేళనంగా నిలిచిన శ్రీవారి లడ్డూ ప్రసాదం తిరుమల మహత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతోంది.