జీఐ ట్యాగ్స్ ఆన్ వీల్స్‌‌... వినూత్న కార్యక్రమానికి టీజీఎస్‌‌ ఆర్టీసీ శ్రీకారం

జీఐ ట్యాగ్స్ ఆన్ వీల్స్‌‌... వినూత్న కార్యక్రమానికి టీజీఎస్‌‌ ఆర్టీసీ శ్రీకారం
  •     బస్సులపై 6 జీఐ ట్యాగ్‌‌ హస్తకళల ప్రదర్శన
  •     ప్రారంభించిన గవర్నర్, పాల్గొన్న మంత్రి పొన్నం, ఆర్టీసీ అధికారులు
  •     సమాజానికి సంస్కృతి అనేది ఆత్మ స్వరూపం: గవర్నర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని గ్రామీణ ప్రాంత కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ఆ సంస్థ ‘జీఐ ట్యాగ్ ఆన్ వీల్స్’  అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్‌‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) వద్ద   గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ  ప్రారంభించారు. 

పోచంపల్లి ఇక్కత్, వరంగల్ తివాచీలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నారాయణపేట్ చీరలు, నిర్మల్ పెయింటిగ్స్, చేర్యాల్‌‌ స్కోల్ పెయింటింగ్స్ లాంటి 6  ప్రముఖ జీఐ ( జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ) హస్త కళలను ఆయా జిల్లాలకు వెళ్లే బస్సులపై ప్రదర్శించారు. ఈ డిజైన్లను జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించారు.  

ఈ ఆరు బస్సులను  ప్రారంభించిన అనంతరం గవర్నర్‌‌‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ మాట్లాడారు. జీఐ గుర్తింపు పొందిన కళారూపాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం ‘జీఐ ట్యాగ్ ఆన్ వీల్స్’ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. సంస్కృతి అనేది సమాజానికి ఆత్మ స్వరూపమని, సాంస్కృతిక అవగాహన లేకుండా సమాజాభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సంప్రదాయ కళలపై ఆసక్తిని పెంచుతాయని,  సమాజంలో కళాకారులకు గౌరవం, ఉపాధి పెరుగుతుందని పేర్కొన్నారు. 

గవర్నర్‌‌‌‌ సూచన మేరకే..: మంత్రి పొన్నం

 గవర్నర్ సూచన మేరకే తాము ఈ కార్యక్రమాన్ని రూపొందించామని, ఆయన దూరదృష్టి ఫలితమే ఇప్పుడు ఈ కార్యక్రమానికి నాంది అని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ స్పష్టం చేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా కళాకారులకు ఉపాధి అవకాశాలు  పెరిగి, వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అన్నారు. 

ఆర్టీసీ సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృతస్థాయిలో అమలు చేసి తెలంగాణ వారసత్వ కళలను, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్‌‌ఆర్టీసీ వైస్ చైర్మన్‌‌​ అండ్​ మేనేజింగ్ డైరెక్టర్  నాగిరెడ్డి , హైదరాబాద్ జిల్లా కలెక్టర్  హరి చందన దాసరి పాల్గొన్నారు.