వైట్ ప్లేట్ వాహనాల్లో ప్రజా రవాణాను అరికట్టకుంటే సమ్మె

వైట్ ప్లేట్ వాహనాల్లో ప్రజా రవాణాను అరికట్టకుంటే సమ్మె
  • రవాణా శాఖ అధికారులకు గిగ్ అండ్
  • ప్లాట్‌‌ఫామ్ వర్కర్స్ యూనియన్ హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: సరైన అనుమతులు లేకుండా రాష్ట్రంలో యథేచ్చగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌‌ఫామ్ వర్కర్స్ యూనియన్ నేతలు జేటీసీ చంద్ర శేఖర్‌‌‌‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు . కఠిన చర్యలు తీసుకోకపోతే జూన్ మొదటి వారంలో సమ్మె తప్పదని హెచ్చరించారు. ఆ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్, ఇతర నేతలు మంగళవారం రవాణా శాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు.

వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించే వైట్ ప్లేట్ వాహనాలను ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో కమర్షియల్ అవసరాల కోసం అక్రమంగా వాడుతున్నారని, దీనివల్ల రవాణా రంగానికి నష్టం వాటిల్లుతోందని, దీనిని వెంటనే అరికట్టాలని కోరారు. నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా క్యాబ్ చార్జీలను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై రవాణా శాఖ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే, జూన్ మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు.