IND VS ENG 2025: వరుసగా రెండో సెంచరీ.. 25 ఏళ్లకే ధోనీ రికార్డ్ సమం చేసిన గిల్

IND VS ENG 2025: వరుసగా రెండో సెంచరీ.. 25 ఏళ్లకే ధోనీ రికార్డ్ సమం చేసిన గిల్

ఇంగ్లాండ్ టూర్ లో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ అదరగొడుతున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. వరుస సెంచరీలతో ఇంగ్లాండ్ గడ్డపై ఆధిపత్యం చూపిస్తున్నాడు. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీ బాదిన గిల్.. బుధవారం (జూలై 2) బర్మింగ్ హోమ్ వేదికగా ఇంగ్లాండ్ తో ప్రారంభమైన రెండో టెస్టులో శతకం(114*) కొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని 199 బంతుల్లో 11 ఫోర్లు బాది సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ పై గిల్ కు వరుసగా మూడు టెస్టుల్లో మూడో సెంచరీ కావడం విశేషం. 

గత ఏడాది ధర్మశాలలో ఇంగ్లాండ్ పై చివరి టెస్టులో సెంచరీ కొట్టిన గిల్.. ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో వరుస టెస్టుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. గిల్ అంతర్జాతీయ కెరీర్ లో ఇది 16 వ సెంచరీ కావడం విశేషం. టెస్టుల్లో 7.. వన్డేల్లో 8.. టీ20ల్లో ఒక సెంచరీ ఉన్నాయి. బర్మింగ్ హోమ్ టెస్టులో సెంచరీ బాది అంతర్జాతీయ కెరీర్ లో 16 వ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సెంచరీల రికార్డ్ సమం చేశాడు. వన్డేల్లో ధోనీ 10 సెంచరీలు.. టెస్టుల్లో 6 సెంచరీలు చేశాడు. ఈ సెంచరీతో టీమిండియా టెస్ట్ కెప్టెన్ అత్యధిక సెంచరీ బాదిన భారత క్రికెటర్లలో 16 వ స్థానంలో నిలిచాడు.

100 సెంచరీలతో సచిన్ టాప్ లో ఉండగా.. 82 సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ (49), రాహుల్ ద్రవిడ్ (48) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే గిల్ 114 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు.  కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (216 బాల్స్‌‌లో 12 ఫోర్లతో 114 బ్యాటింగ్‌‌) సెంచరీకి తోడు యశస్వి జైస్వాల్‌‌ (87) మెరుగ్గా ఆడటంతో.. తొలి ఇన్నింగ్స్‌‌లో ఇండియా 85 ఓవర్లలో 310/5 స్కోరు చేసింది. ఆట ముగిసే సమయానికి గిల్‌‌తో పాటు రవీంద్ర జడేజా (41 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. కరుణ్‌‌ నాయర్‌‌ (31) ఫర్వాలేదనిపించాడు. క్రిస్‌‌ వోక్స్‌‌ రెండు వికెట్లు పడగొట్టాడు.