పోడు పట్టాల పంపిణీ తర్వాతే గిరిజన బంధు

పోడు పట్టాల పంపిణీ తర్వాతే గిరిజన బంధు

హైదరాబాద్, వెలుగు : పోడు భూముల పట్టాల పంపిణీ సంగతి తేలిన తర్వాత గిరిజన బంధు స్కీం మొదలవుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌రావు స్పష్టం చేశారు. గిరిజన బంధు అందరికీ ఇవ్వడం లేదని, భూమి, స్వయంఉపాధి లేని పేదలకే ఈ స్కీం అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన ఈ  వ్యాఖ్యలు చేశారు. గిరిజన బంధుకు బడ్జెట్‌‌లో నిధులు కేటాయించకపోవడాన్ని కాంగ్రెస్‌‌ ఎమ్మెల్సీ జీవన్‌‌ రెడ్డి ప్రశ్నించారు. దీనికి హరీశ్  స్పందిస్తూ.. ‘‘గిరిజన బంధు విషయంలో సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా ఉన్నారు. పోడు భూముల పట్టాలను ఈ నెల చివరికల్లా పంపిణీ చేస్తామన్నారు. పట్టాల పంపిణీ తర్వాత ఇంకా ఎవరైనా భూమి లేకుండా, ఏ రకమైన ఉపాధి లేక పేదరికంలో గిరిజనులు ఉంటే, వారిని గుర్తించి రాబోయే రోజుల్లో గిరిజన బంధు ఇస్తాం” అని హరీశ్ అన్నారు. దళిత బంధు కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1300 కోట్లు ఖర్చుచేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్‌‌మెంట్ ఫండ్‌‌ నుంచి ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు చేశామన్నారు. ఓల్డ్ సిటీ డెవలప్‌‌మెంట్ కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేశామని, బడ్జెట్‌‌లో పెట్టని పనులకు కూడా నిధులు ఇచ్చామన్నారు. యాదాద్రి థర్మల్ పవర్‌‌‌‌ ప్లాంట్‌‌ ప్రారంభమయ్యాక, పవర్ సర్‌‌‌‌ప్లస్‌‌ స్టేట్‌‌గా తెలంగాణ నిలుస్తుందని మంత్రి చెప్పారు. తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు అనుగుణంగా బడ్జెట్‌‌ కేటాయింపులు చేశామని, ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపాలని మంత్రి కోరగా, సభ్యులు ఆమోదించారు.

పెనంపై నుంచి పొయ్యిల పడినం

కాంగ్రెస్‌‌ గవర్నమెంట్‌‌ ఉన్నప్పుడు పెనం మీద ఉన్నట్లుండేదని, బీజేపీ రాకతో రాష్ట్రం పొయ్యిలో పడినట్లయిందని హరీశ్‌‌  విమర్శించారు. సింగరేణి, ఆర్టీసీ వంటి సంస్థలను అమ్మాలని కేంద్రం లేఖలు రాసిందని, తాము ఎన్నటికీ అలాంటి పని చేయబోమన్నారు. కేంద్రం చెప్పినట్లు వాటిని అమ్మి ఉంటే,  రూ.30 వేల కోట్ల ఆదాయం వచ్చేదని.. అయినా తాము అలాంటి పని చేయలేదన్నారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని, మనకు రావాల్సిన నిధులను ఆపుతోందని ఆయన ఆరోపించారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు కేంద్రం నిధులు ఇచ్చిందని, అందులో ఒక్క తెలంగాణ కాలేజీ కూడా లేదన్నారు. పత్తి కొనుగోలు నుంచి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. హిండెన్‌‌బర్గ్  రిపోర్ట్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించకపోవడాన్ని బట్టి ఆయన ఏదో తప్పు చేశారని అనిపిస్తోందన్నారు. 

కూల్చడాలను జీవన్‌‌ రెడ్డి సమర్థించరు

ప్రగతి భవన్‌‌ను పేల్చేయాలన్న పీసీసీ చీఫ్ రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యలను మండలిలో హరీశ్‌‌రావు పరోక్షంగా ప్రస్తావించారు. ‘కొంత మంది కూలుస్తాం, పేలుస్తాం అని మాట్లాడుతున్నరు. దీన్ని అందరూ ఖండించాలి. కూల్చడాలు, పేల్చడాలను జీవన్‌‌ రెడ్డి వంటి నేతలు సమర్థించరు. నిర్మించడాన్నే వారు కోరుకుంటారు. ఈ విషయాన్ని వారి పార్టీ అధిష్టానం దృష్టికి ఆయన తీసుకెళ్లాలి’’ అని హరీశ్‌‌  సూచించారు. హరీశ్‌‌ మాటలకు సరే అన్నట్టు జీవన్‌‌ రెడ్డి తల ఊపారు.

ఏప్రిల్​ నుంచి అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్​ కిట్లు

ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందజేస్తామని హెల్త్​ మినిస్టర్​ హరీశ్​రావు అన్నారు. దీని కోసం బడ్జెట్​లో నిధులు కూడా కేటాయించామని తెలిపారు. ప్రశ్నోత్తరాల టైంలో హరీశ్​రావు మాట్లాడారు. పేద ప్రజల సుస్తి పోగొట్టిన బస్తీ దవాఖానాలు.. దోస్తీ దవాఖానాలుగా మారాయన్నారు. బస్తీ హాస్పిటల్స్​లో కోటి మంది సేవలు పొందారని గుర్తు చేశారు. 1.48లక్షల మందికి రూ.800 విలువ చేసే లిక్విడ్​ ప్రొఫైల్ టెస్ట్ చేశామన్నారు. లక్షా 800 మందికి థైరాయిడ్​ టెస్టులు చేశామని వివరించారు. బస్తీ దవాఖానాల్లో 57 రకాల పరీక్షలు చేస్తున్నామని, వాటిని 134కు పెంచుతామన్నారు.