
హైదరాబాద్, వెలుగు: ఫోన్ లో మాట్లాడొద్దన్నందుకు ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా ఉంద్యాల గ్రామానికి చెందిన విష్ణు(45) హోంగార్డుగా చేస్తున్నారు. మేడ్చల్‌జిల్లా ఘట్‌కేసర్ మండలం అన్నొజిగూడ ఆర్జికే కాలనీలో నివాసం ఉంటున్నారు. కూతురు స్రవంతి(16) సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతోంది. లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటోంది. ఫ్రెండ్స్‌తో ఫోన్స్ ఎక్కువగా మాట్లాడేది. ఈ క్రమంలో తల్లిదండ్రులు పలుసార్లు మందలించారు. శుక్రవారం రాత్రి ఫోన్ విషయంలో తల్లీకూతుళ్ల మధ్య వివాదం నెలకొంది. దీంతో రాత్రి 11 గంటల సమయంలో స్రవంతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంటికి సమీపంలోని ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన పూర్తిగా కాలిన డెడ్‌బాడీ ఉందనే సమాచారంతో ఘట్‌కేసర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ముందుగా అనుమానించారు. శుక్రవారం రాత్రి స్రవంతి ఇంటి నుంచి బయటకు వెళ్తుండడం సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. అనుమానాస్పద మృతి కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.