- చెరువు కట్ట మీద అనుమానాస్పద స్థితిలో మృతదేహం
- అలాంటి ఆనవాళ్లేవీ లేవన్న పోలీసులు
- పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు డెడ్‌బాడీ తరలింపు
- నారాయణపేట జిల్లాలో ఘటన
నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాలో ఐదేళ్ల చిన్నారిని దారుణంగా హత్యచేశారు. ఆమెది హత్యా.. ఎవరైనా బలి ఇచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణపేట మండలం అమ్మిరెడ్డిపల్లి(బోయిన్ పల్లి) గ్రామానికి చెందిన గొల్ల అంజయ్య, శిరీష దంపతులకు కుమార్తె తేజశ్రీ(5), కుమారుడు వివేక్ (2) ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో భార్యాభర్తలు కొడుకును తీసుకొని ఉపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్లారు. చిన్నారిని ఊళ్లోనే అంజయ్య తన తల్లిదండ్రుల వద్ద వదిలివెళ్లాడు.
మంగళవారం రాత్రి తేజశ్రీ భోజనం అనంతరం నాన్నమ్మ, తాత వద్ద ఆరుబయటే నిద్రపోయింది. అర్ధరాత్రి దాటాకా చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాలిక ఇంటి సమీపంలోని చెరువు కట్టపై హత్య చేశారు. గ్రామానికి చెందిన వ్యక్తులు పొలం పనులు ముగించుకొని తిరిగి వస్తూ చెరువు కట్టమీద బాలిక మృతదేహాన్ని చూశారు. వెంటనే డయల్100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నారాయణపేట రూరల్ పోలీసులు పరిసరాలను పరిశీలించారు.
డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్‌తో తనిఖీలు చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. బుధవారం ఉదయం బాలిక మృతదేహాన్ని నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని హైదరాబాద్‌లోని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆసుపత్రి వద్దకు చేరుకుని భోరున విలపించారు. అయితే బాలిక మృతదేహాన్ని సాయంత్రం పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మృతిపై అనుమానాలు
బాలిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్నారిని ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకు చంపారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బాలిక కాళ్లకు ఉన్న వెండి కడియాలను మాత్రమే తీసుకుని చెవులకు ఉన్న కమ్మలను వదిలేశారు. బాలికను ఎత్తుకెళ్లినప్పుడు ఆమె పక్కన పడుకున్న వాళ్ల నాన్నమ్మ మెడలో దాదాపు రూ. 4 లక్షల బంగారు ఆభరణాలున్నాయి.
వాటిని కూడా ముట్టుకోలేదు. దీన్ని బట్టి ఇది దొంగల పని కాదని భావిస్తున్నారు. తెలిసిన వాళ్లే బాలికను ఎత్తుకెళ్లి చెరువు కట్ట వద్ద హత్య చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, బాలికను చెరువు కట్టపై బలి ఇచ్చారంటూ గ్రామంలో మొదట పుకార్లు వచ్చాయి. కానీ అలాంటి ఆనవాళ్లేవీ లేవని పోలీసులు చెప్పారు.
